పరిహారం తేల్చి సర్వే చేయండి
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:46 AM
మూసీ సుందరీకరణలో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు భూసర్వే కోసం వచ్చిన మూసీ ప్రాజెక్టు అధికారులను సర్వే చేయకుండా స్థానికులు అడ్డుకున్నారు.
మూసీ ప్రాజెక్టు అధికారులను అడ్డుకున్న స్థానికులు
నార్సింగ్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : మూసీ సుందరీకరణలో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు భూసర్వే కోసం వచ్చిన మూసీ ప్రాజెక్టు అధికారులను సర్వే చేయకుండా స్థానికులు అడ్డుకున్నారు. సోమవారం హిమాయత్‌సాగర్ గ్రామం, దర్గా ఖలీజ్‌ఖాన్, కిస్మత్‌పూర్ ప్రాంతాల్లో భూ సేకరణ కోసం సర్వే చేసేందుకు అధికారుల బృందం వచ్చింది. అయితే స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకొని బాధితులకు ఎంత పరిహారం ఇస్తున్నారు.. ఎక్కడ ఇస్తున్నారు? అన్నది తేలిన తర్వాత భూములు ఇస్తామని, ముందు మాకు ఎక్కడ ఇస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. తాము భూములు ఇచ్చేందుకు వ్యతిరేకం కాదని, కానీ పరిహారం ఎంత ఇస్తారు? ఎక్కడ.. ఎలా ఇస్తారో అన్నది తేల్చాలని వారు డిమాండ్ చేశారు. పరిహారం తేలిన తర్వాతే సర్వే నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో అక్కడికి వచ్చిన అధికారులు, సర్వే ఏజెన్సీ బృందం వెనుదిరిగిపోయారు.