kumaram bheem asifabad-సమస్యలపై ఏకరువు
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:27 PM
వాంకిడి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పాటిల్ జోత్స్న అధ్యక్షతన నిర్వహించిన మండల సమావేశానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
- మండల సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన సర్పంచ్‌లు
వాంకిడి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వాంకిడి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పాటిల్ జోత్స్న అధ్యక్షతన నిర్వహించిన మండల సమావేశానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. వాంకిడి ప్రభుత్వ వైద్య శాలలో వైద్యాధికారి నిర్లక్ష్యం వల్ల వైద్య సిబ్బంది ఇష్టారాజ్యాంగా వ్యవహారిస్తున్నారని రోగులను పట్టించుకోవడంలేదని వాంకిడి సర్పంచ్ సతీష్‌తోపాటు పలువురు సర్పంచ్‌లు ఆరోపించారు. అనారోగ్య కారాణాలతో వైద్యశాలకు వెళ్తే వైద్యాధికారి పరీక్షించకుండా అక్కడ పనిచేస్తున్న వర్కర్లు సలైన్ బాటిళ్లు పెడుతూ వైద్యం చేస్తున్నారని చెప్పారు. . వైద్యశాలలో రక్త పరీక్షలు చేయక పోవడంతో రోగులు బయటి వ్యక్తులతో రక్త పరీక్షలు చేయిస్తున్నారని సర్పంచు సతీష్ అన్నారు. ఏ చిన్న అనారోగ్యంతో వెళ్లినా కనీసం ప్రథమ చికిత్స చేయకుండానే ఆసిఫాబాద్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారని వాపోయారు. అలాంటప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఆసుపత్రి ఎందుకని ప్రశ్నించారు. పంచాయతీల్లో నిధులు లేని కారణంగా ఎలాంటి అభివృద్ది పనులు చేయలేక పోతున్నామని సభ్యులు తెలిపారు. వర్షాకాలంలో పలు గ్రామాల్లో రోడ్లు బురదమయంగా మారిప్రజలు ఇబ్బందులు పడుతుంటే కసీనం ఇసుక వేయడానికి కూడా స్థానిక తహసీల్దార్ అనుమతి ఇవ్వడం లేదని సర్పంచ్ సతీష్ అన్నారు. మండలంలో అంగన్‌వాడీ టీచర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడంలేదని ప్రస్తుతం జరుగుతన్న పోషణ మాసం, కార్యక్రమాలతోపాటు సమగ్ర శిశు సంక్షేమ శాఖ ద్వారా చేపట్టే తదితర కార్యక్రమాలకు తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదని సర్పంచులు ఆరోపించారు. మండలంలో పనిచేస్తున్న జీపీఏలు దరఖాస్తు చేసుకున్న లబ్ధిరుల నుంచి విచారణ పేరుతో డబ్బులు అడుతున్నారని సభ్యులు ఆరోపించారు. గత సమావేశంలో మండలంలోని వివిద గ్రామాల్లో ఇనుప విద్యుత్ స్థంభాలు తొలగించాలని సభ్యులు కోరగా నేటి వరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. వచ్చే సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో హాజరుకావాలని లేని పక్షంలో సమావేశాన్ని బహిష్కరిస్తామని సర్పంచ్‌లు హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ మాట్లాడుతూ అధికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశానికి పూర్తి స్థాయిలో అధికారులు హాజరుకాకపోతే సభ్యులు తమ సమస్యలను ఎవరికి వినిపించాలని ప్రశ్నించారు. వచ్చే సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యేల చూడాలని ఎంపీడీవోను కోరారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ జాబిరె పెంటు, ఎంపీఓ ఖాజా అజీజుద్దిన్, ఏఓ గోపికాంత్, ఈజీఎస్ ఏపీవో శ్రావణ్‌కుమార్, పీఆర్ ఏఈ కిరణ్, హౌసింగ్ ఏఈ నాగరాజు, ఎఫ్‌బీవో ప్రకాష్, వివిద శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.