లింక్డిన్‌లో ఉద్యోగాల పేరుతో మోసం
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:40 AM
నిరుద్యోగ యువకులను లక్ష్యంగా చేసుకుని లింక్డిన్ వేదికగా సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఐటీ సంస్థ ఎన్‌టీటీ డేటాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఆరుగురు నిరుద్యోగుల ....
ఆరుగురు నిరుద్యోగుల నుంచి 10.30 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
హైదరాబాద్ సిటీ, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువకులను లక్ష్యంగా చేసుకుని లింక్డిన్ వేదికగా సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఐటీ సంస్థ ఎన్‌టీటీ డేటాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఆరుగురు నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.10.30 లక్షలు వసూలు చేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లపై సైబర్ కైరమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గచ్చిబౌలికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి గత మార్చిలో లింక్డిన్‌లో ఉద్యోగావకాశాల కోసం పరిశీలించాడు. అందులో నాతువ మధు అనే వ్యక్తి ప్రొఫైల్‌ను చూసి అతడిని సంప్రదించాడు. దీంతో నాతువ మధు తనకు ఎన్‌టీటీ డేటా సంస్థలో ఉన్నత స్థాయిలో పరిచయాలున్నాయని కచ్చితంగా ఉద్యోగం ఇప్పించగలనని బాధితుడిని నమ్మించాడు. మరికొందరు నిరుద్యోగులను కూడా తనకు పరిచయం చేయాలని సూచించడంతో బాధితుడు మరో ఐదుగురు అభ్యర్థులను అతనికి పరిచయం చేశాడు. దీంతో మధు వారికి ఉద్యోగానికి ఎంపికైనట్లు ఈమెయిళ్లు, నకిలీ ఆఫర్ లెటర్లు పంపించాడు. అనంతరం ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా మొత్తం రూ.10.30 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత నిందితులు ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితుడు సహచరుల తర ఫున సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మధుతో పాటు ఈ మోసంలో మేడం వెంకట కార్తీక్ రెడ్డి అనే మరో వ్యక్తి పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు.
సాప్ట్‌వేర్ ఉద్యోగిని నుంచి రూ.3.50 లక్షలు...
ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నకిలీ ఆఫర్ లెటర్ పంపించి ఓ మహిళా సాప్ట్‌వేర్ ఉద్యోగినిని రూ.3.50 లక్షలకు ఓ వ్యక్తి మోసం చేశాడు. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ ఫేజ్-7కు చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగిని వివిధ జాబ్ పోర్టల్స్‌లో తన బయోడేటాను నమోదు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2న తిరుపతి అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా ఆమెను సంప్రదిండాడు. తాను అడ్మిఫిట్ కన్సల్టెన్సీ ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగం కోసం రూ.3.50 లక్షలు చెల్లించాలని షరతు పెట్టాడు. అనంతరం ఏప్రిల్ 21న ఎన్‌టీటీ డేటా గ్లోబల్‌లో ఉద్యోగానికి ఎంపికైనట్లు పేర్కొంటూ ఓ ఆఫర్ లెటర్‌ను ఆమె మెయిల్‌కు పంపించా డు. తర్వాత ఇంటర్వ్యూ ప్యానెల్ సభ్యులు అడుగుతున్నారని మిగతా డబ్బును కూడా వసూలు చేశాడు. ఆ తర్వాత ఆఫర్ లెటర్‌ను పరిశీలించగా నకిలీదని తేలింది. దీంతో బాధితురాలు సైబర్ కైరమ్ పోలీసులను ఆశ్రయించింది.