ఒబేసిటీకి జీవనశైలితో కళ్లెం
ABN , Publish Date - Feb 28 , 2026 | 03:34 AM
మా ఇంట్లో అందరూ లావుగానే ఉంటారు.. నేను కూడా లావుగానే ఉన్నాను.. ఏం తినకపోయినా స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నాం..
రోజువారీ అలవాట్లు మార్చుకుంటే చక్కటి ఫలితాలు.. జన్యుపరంగా వచ్చే ఒబేసిటీని కూడా నియంత్రించవచ్చు
ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడి
ఏడు వేల మందిపై ఏఐజీ ఆస్పత్రి అధ్యయనం
‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో పరిశోధన ఫలితాల ప్రచురణ
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘మా ఇంట్లో అందరూ లావుగానే ఉంటారు.. నేను కూడా లావుగానే ఉన్నాను.. ఏం తినకపోయినా స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నాం.. బరువు తగ్గాలంటే ఏం చేయాలి’.. అంటూ చాలా మంది ప్రజలు వైద్యులను సంప్రదిస్తుంటారు. ఈ సమస్యకు జీవన శైలిలో మార్పులతో కళ్లెం వేయవచ్చని ఏఐజీ ఆస్పత్రుల పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. సాధారణ స్థూలకాయంతోపాటు జన్యుపరంగా వచ్చే ఒబేసిటీని కూడా నియంత్రించవచ్చని వెల్లడైంది. ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి, సెంటర్ ఫర్ ఓబేసిటీ మెటబాలిక్ థెరపీ డైరెక్టర్ డా.రాకేష్ కలపాల, డాక్టర్ నితిన్ జగ్త్‌పలు.. లక్సెంబర్గ్ సెంటర్ ఫర్ సిస్టమ్స్ బయోమెడిసిన్, లక్సెంబర్గ్ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ హ్యూమన్ జెనెటిక్స్ సంస్థలతో కలిసి నిర్వహించిన ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్స్ట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భారత్, బ్రిటన్‌లో ఉంటున్న భారతీయులపై ఈ అధ్యయనం నిర్వహించినట్లు నాగేశ్వర్‌రెడ్డి గురువారం వెల్లడించారు. ఈ విశ్లేషణలో యూకేబయో బ్యాంక్‌లోని భారతీయుల డేటాతోపాటు ఏఐజీ ఆస్పత్రులు రూపొందించిన భారతీయ కోహోర్ట్ డేటాను ఉపయోగించినట్లు తెలిపారు. తమ పరిశోధన భవిష్యత్తులో ప్రెసిషన్ ప్రివెన్షన్‌కు పునాది వేస్తుందని పేర్కొన్నారు.
జీవన శైలితో ఒబేసిటీకి లింకు..
భారత్, యూకేలోని దాదాపు 7 వేల మంది ఈ అధ్యయంలో పాల్గొన్నట్లు నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. జీవన శైలి బాగున్న వారిలో స్థూలకాయం సమస్య పెద్దగా లేదని, జీవన శైలి బాగాలేని వారిలో జన్యువులు మెరుగ్గా లేక ఊబకాయం పెరుగుతోందని తెలిపారు. జీనోమ్ - వైడ్ ఎస్‌ఎన్‌పీ మైక్రో ఆరే ప్లాట్‌ఫామ్ ఉపయోగించి వేల జన్యు వేరియంట్లను విశ్లేషించినట్లు డాక్టర్ రాకేష్ తెలిపారు. ఈ డేటా ఆధారంగా పాలీజెనిక్ రిస్క్ స్కోర్లు తయారుచేసినట్లు చెప్పారు. జన్యు ప్రమాదం, జీవనశైలి కలయికతో స్థూలకాయం సమస్య మరింత పెరుగుతున్నట్లు తమ విశ్లేషణలో తేలిందన్నారు.
వారానికి 150 నిమిషాల వ్యాయామం
జన్యువులు అసాధారణంగా ఉండటం వల్ల వచ్చే ఒబేసిటీకి కూడా చెక్ పెట్టవచ్చుని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. కొవ్వు లేకుండా ఆహారం తీసుకోవడం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకుండా జాగ్రత్త పడడం, ఎక్కువ మిల్లెట్స్, ప్రొటీన్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఒబేసిటీని నియంత్రించవచ్చని చెప్పారు. అలాగే వారానికి తప్పనిసరిగ్గా 150 నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయమం చేయాలని, ఽధూమపానం పూర్తిగా మానేయాలని సూచించారు. శరీర బరువుకు తగ్గట్టుగా ప్రొటీన్స్ తీసుకోవాలని సూచించారు. కిలో శరీరబరువుకు 1 నుంచి 1.5 గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలని తెలిపారు. రోజుకు రెండు గుడ్లలోని తెల్ల సొనను తింటే 14 గ్రాముల ప్రోటీన్‌లభిస్తుందని చెప్పారు. ఫైబర్‌ను తీపి పదార్థాలతో కలిపి తీసుకోవద్దని సూచించారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మొదటి మూడు నెలల్లో మార్పు కనిపిస్తుందని, ఏడాదిలోగాఒబేసిటీని పూర్తిగా నియంత్రణలో పెట్టవచ్చని తెలిపారు. నడుము చుట్టుకొలత, రక్తంలో చక్కెర, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలను యుక్త వయసు నుంచే చేయించుకుంటూ ఉండాలని సూచించారు.