చూపుడు వేలితో 106 వ్యాధుల గుర్తింపు
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:22 AM
హైదరాబాద్‌లో బుధ వారం ముగిసిన బయో ఆసియా-2026 సదస్సులో పలు కంపెనీలు వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించాయి. చూపుడు వేలితో ఒంట్లోని 106 రకాల వ్యాధులను గుర్తించే....
గుండెపోటు ప్రమాదాన్ని గుర్తించే త్రోబ్
సోరియాసిస్ మచ్చలను నయం చేసే లేపనం
బయో ఆసియా సదస్సులో పలు కంపెనీల వినూత్న ఆవిష్కరణలు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో బుధ వారం ముగిసిన బయో ఆసియా-2026 సదస్సులో పలు కంపెనీలు వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించాయి. చూపుడు వేలితో ఒంట్లోని 106 రకాల వ్యాధులను గుర్తించే ‘లైఫాస్ వన్’ అనే మొబైల్ యాప్‌ను ఆక్యూలీ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని, స్మార్ట్‌ఫోన్ కెమెరాను చూపుడు వేలితో మూడు నిమిషాలు మూసి పట్టుకుంటే.. రక్తపోటు, మధుమేహ స్థాయిలు, అవయవాల పనితీరు, మానసిక ఒత్తిడి స్థాయిలు, కార్డియో వాస్క్యులర్ హెల్త్ వంటి 106 రకాల పారామీటర్స్‌ను గుర్తించి ఇది రిపోర్టుగా అందిస్తుంది. అయితే, ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో ఉండదు. ఆక్యూలీ ల్యాబ్ ప్రతినిధులను 86396 64198 నంబర్ ద్వారా సంప్రదిస్తే... వాళ్లు సంబంధిత వ్యక్తుల వివరాలు రిజిస్ట్రర్ చేసుకొని రూ.1,000 ధరకు ఈ యాప్‌ను అందిస్తారు. ఈ యాప్ ద్వారా వెల్లడయ్యే రోగనిర్ధారణ ఫలితాలు 50 నుంచి 70 శాతం వరకు కచ్చితత్వాన్ని కలిగి ఉంటాయని ఆక్యూలీ సంస్థ ప్రతినిధి పీబీ సాయినాథ్ తెలిపారు. జలుబు, తలనొప్పి, కండరాల నొప్పిని తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే ప్యాచ్ (పట్టీ)ను చెన్నైకి చెందిన ప్యాచ్‌ప్ల్‌స వెల్‌నెస్ సంస్థ రూపొందించింది. శరీరంపై ఆ పట్టీని 8 గంటల పాటు అతికించి ఉంచితే బాధ మాయమవుతుందని దీని తయారీలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త పూర్ణిమ చెప్పారు. జలుబును నయంచేసే ప్యాచ్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపారు. దీని ధర రూ.40 నుంచి రూ.60 మధ్య ఉంటుందని వెల్లడించారు.
గుండెపోటును కనిపెట్టే త్రోబ్..!
గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే త్రోబ్ అనే పరికరాన్ని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ రూపొందించింది. దీనిద్వారా నిర్వహించే పరీక్షకు రూ.200-300 మాత్రమే ఖర్చు అవుతుందని ఈ పరికరం రూపకల్పనలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ నాగసాయి విశ్వేశ్వర్ తెలిపారు. సర్ఫేస్ ప్లాస్మాన్ కపుల్డ్ ఎమిషన్ సాంకేతికతతో ఇది పనిచేస్తుందని, నిమిషాల వ్యవధిలోనే ఫలితాలు తెలుస్తాయని చెప్పారు. సోరియాసిస్ ప్రాణాంతకం కాకపోయినా మానసికంగా తీవ్ర వేదనకు గురిచేస్తుంది. చర్మం మీద ఏర్పడే మచ్చలతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ సోరియాసిస్ మచ్చలను నయంచేసే లేపనాన్ని మరో రెండు నెలల్లో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఆక్యూబయోసిస్ కంపెనీ నిర్వాహకుడు డా.శ్రీనివాస్ మద్ది తెలిపారు. ఈ పూతమందుతో మూడు నెలల్లోనే సోరియాసిస్ తగ్గుముఖం పడుతుందని చెప్పారు. ఈ లేపనం ఆయుష్ నుంచి అనుమతి పొందిందని పేర్కొన్నారు. కాగా, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకొచ్చే ఔత్సాహికులకు కర్ణాటక ప్రభుత్వం రూ.50 లక్షల వరకు గ్రాంటు అందిస్తున్నట్లు సదస్సులో స్టాల్ ఏర్పాటు చేసిన ఆ రాష్ట్ర ప్రతినిధులు తెలిపారు. మరోవైపు అత్యాఽధునిక ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు డీప్‌టెక్ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏఐసీ టీ హబ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిందని టీహబ్ ప్రతినిధి రిషబ్ తెలిపారు.