Share News

kumaram bheem asifabad- అమ్ముదామా..ఆగుదామా..

ABN , Publish Date - Jan 30 , 2026 | 10:53 PM

పత్తి ధర పెరుగుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పంట చేతికి వచ్చిన ప్రారంభంలో ప్రైవేట్‌లోనూ ధర ఉంది. తక్కు వ పండించిన రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లలేక వ్యాపారులకే విక్రయించేందుకు మొగ్గు చూపారు.

kumaram bheem asifabad- అమ్ముదామా..ఆగుదామా..
రైతు నిల్వ చేసిన పత్తి

- సందిగ్ధంలో పత్తి రైతులు

వాంకిడి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): పత్తి ధర పెరుగుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పంట చేతికి వచ్చిన ప్రారంభంలో ప్రైవేట్‌లోనూ ధర ఉంది. తక్కు వ పండించిన రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లలేక వ్యాపారులకే విక్రయించేందుకు మొగ్గు చూపారు. కొందరు మాత్రం ధర లేదని నిల్వ చేశారు. ఇప్పడిప్పుడే ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కవగా ప్రైవేట్‌లో పలుకుతోంది. దీంతో ఇంకా ఏమైనా పెరుగుతుం దోననే ఆశలో రైతులు ఉన్నారు. సీజన్‌ ప్రారంభం నుంచి బహిరంగ మార్కెట్‌లో పత్తి ధర క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 6,500 పలికింది. ప్రస్తుతం రూ. 8,000 వరకు పలుకుతోంది. ఇది రూ. 9.000 వరకు చేరుకుంటుందని రైతులు భావిస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు ప్రారంభమైన తర్వాత రైతులు సీసీఐకే విక్రయించి మద్దతు ధర పొందారు. తక్కువ పండిం చిన వారు మాత్రం ప్రైవేట్‌లో విక్రయించి నష్టపోయారు. ఎకరాకు 12 కింటాళ్ల లోపు దిగుబడి వచ్చిన రైతులు మాత్రం సీసీఐకి విక్రయించారు. ఎక్కువగా దిగుబడి వచ్చిన రైతులు సీసీఐకి విక్ర యించగా మిగిలిన పత్తిని వ్యాపారులకు అమ్ముకున్నారు.

- 4.40 లక్షల ఎకరాల్లో..

జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 4.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 3.30 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. ఎకరా పత్తి సాగుకు రూ. 20 నుంచి 30వేల దాకా పెట్టు బడి అవుతుంది. ఎకరాకు సుమారు 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా ఈసారి కేవలం నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడి కష్టమవు తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాగుకు ఏటా వ్యయం పెరుగుతు న్నా.. దిగుబడి మాత్రం తగ్గుతూ వస్తుండంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కాగాఈ ఏడాది జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. పూత, కాత దశలో ఉండగా వర్షాలు కురవడంతో రాలిపోయింది. పంట ఎర్రబారింది. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడులు రావాల్సిన చోట కేవలం నాలుగు, ఐదు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా పెట్టిన పెట్టుబడులు రాక రైతులు నష్టపోయారు. వచ్చిన దిగుబడిని కొందరు రైతులు తక్కువ ధరకే అమ్ము కున్నారు. ఇప్పడు ధర పెరగడంతో క్వింటాలకు రూ. 1,500 లాభం పొందే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మరింత ధరలు పెరిగే అవ కాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగు తుండడంతో వేచి ఉంటే పత్తిని నిల్వ చేయ డం ఒక సమస్య కాగా, తరుగు పెరుగుతుందని రైతులు భయపడుతు న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పత్తిని అమ్ముదా మా...ఆగుదామా అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు.

దిగుబడి తగ్గింది..

- గుర్నులే మెంగాజీ, రైతు

వాతావరణ పరిస్థితుల వల్ల పత్తి పంట దిగుబడి అంతంతమాత్రంగా వచ్చింది. ఎకరాకు నాలుగు క్వింటాళ్లు డిగుబడి కూడా రాలేదు. పంట ఒకేసారి చేతికి వస్తుందన్న ఆశతో సాగుచేశాను. ప్రభుత్వం గిట్టుబాటు ధరను రూ. 10 వేలకు పెంచి రైతులను ఆదుకోవాలి. పత్తి సాగుకు ఖర్చులు పెరుగుతున్నా యి. దిగుబడలు పడిపోవడంతో రైతులకు పెట్టుబడు లు కూడా దక్కని పరిస్థితి ఉంది.

Updated Date - Jan 30 , 2026 | 10:53 PM