ఎల్‌నినో విపత్తును సమష్టిగా ఎదుర్కొందాం
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:26 PM
ఎల్‌నినో సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండి సమష్టిగా ఎదుర్కొందా మని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
వెల్దండ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండి సమష్టిగా ఎదుర్కొందా మని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ, రాబోవు రోజుల్లో సమస్య తీవ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సులోచన అధ్యక్షతన మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శాఖలవారీగా ప్రగతి నివేదికలను సంబంధిత అధికారులు చదివి వినిపించారు. అజిలాపూర్ గ్రామంలో ఫ్రీడం ఫైటర్స్ పేరిట ఇచ్చిన భూమి ఇతరులకు పట్టా అయ్యిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని సర్పంచు రమేష్‌గౌడ్ తహసీల్దార్ కార్తీక్‌కుమార్‌ను కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
మండల సభలో రసాభాస
గ్రామ సర్పంచ్‌నైన తన ప్రమేయం లేకుండానే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని చెర్కూర్ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హతలేనివారికి సైతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని అజిలాపూర్ సర్పంచ్ రమేష్‌గౌడ్ సభ దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి కల్పించుకుని మాట్లాడుతూ ఎవరైనా తమ గ్రామానికి ఇళ్లు కావాలని కోరుతారు తప్ప ఇతరులకు ఇవ్వకూడదని చెప్పడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, నాయకులు బీఆర్‌ఎస్ సర్పంచ్‌లైన శ్రీనివాసులు, రమేష్‌గౌడ్‌లతో వాగ్వివాదానికి దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ యుగందర్‌రెడ్డిలు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చెర్కూర్ గ్రామానికి నేను చెప్పేవరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకూడదని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇళ్ల మంజూరులో అర్హతలేనివారిని గుర్తించాలని ఎంపీడీవోను ఆదేశించారు. సమావేశంలో ఆత్మ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, అధికారులు విజయశ్రీ, కార్తీక్‌కుమార్, బస్వలింగం, శంకరయ్య, సంధ్యారాణి, ఏఈలు, అధికారులు ఉన్నారు.