ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:48 AM
ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడంతో పాటు క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా మార్చి 28, 29 తేదీల్లో ‘లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్-2026’ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యాటక...
28, 29 తేదీల్లో ‘లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్’
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి నిర్వహణ
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడంతో పాటు క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా మార్చి 28, 29 తేదీల్లో ‘లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్-2026’ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్‌కు సంబంధించి తెలంగాణ శాసన సభ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల అర్గనైజింగ్ కమిటీ చైర్మన్ జూపల్లి కృష్ణారావు, కో-చైర్మన్ వాకిటి శ్రీహరి అధ్యక్షతన గురువారం సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఈ నెల 28, 29 తేదీల్లో శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు.. మొదటి ఎడిషన్ ‘లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్--2026’ను నిర్వహిస్తున్నామని చెప్పారు. 28వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ఎల్బీ స్టేడియంలో పోటీలు ప్రారంభమవుతాయన్నారు. మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు సభ్యులంతా పాల్గొంటారని వెల్లడించారు. వివిధ క్రీడాంశాల్లో పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రవీంద్ర భారతీలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న క్రీడాపోటీల పోస్టర్‌ను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గురువారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, విప్‌లు, శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌కు, మంత్రులకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడాశాఖ అధికారులు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.
అసెంబ్లీ జరుగుతుంటే ఆటలేంటి?: కేటీఆర్
కీలకమైన పద్దులపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించడమేంటని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మీడియాతో చిట్‌చాట్‌లో ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. సీరియ్‌సగా సభ జరుగుతున్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన కేటీఆర్.. ఇదే విషయాన్ని తాను మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎటువంటి సమాధానం లేదని విమర్శించారు.