Share News

తెలంగాణ సాంస్కృతిక వేడుకల్లో అదరగొట్టిన శాసనసభ్యులు

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:40 AM

వారంతా శాసనసభ్యులే. నిత్యం ఎంతో పని ఒత్తిడిలో ఉంటారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకల్లో ఆ శాసనసభ్యుల్లోని కళాకారులు ఒక్కసారిగా బయటికొచ్చారు.

తెలంగాణ సాంస్కృతిక వేడుకల్లో అదరగొట్టిన శాసనసభ్యులు

  • దుర్యోధన పాత్రతో ఇరగదీసిన క్రీడా మంత్రి

  • గద్దర్‌ను అనుకరించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

  • కట్టప్పగా ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌ మోనో యాక్షన్‌

  • ఉత్సాహభరితంగా సాంస్కృతిక వేడుకలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): వారంతా శాసనసభ్యులే. నిత్యం ఎంతో పని ఒత్తిడిలో ఉంటారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకల్లో ఆ శాసనసభ్యుల్లోని కళాకారులు ఒక్కసారిగా బయటికొచ్చారు. దుర్యోధన ఏకపాత్రాభినయంతో ఒకరు ఔరా అనిపిస్తే.. ‘‘పొడుస్తున్న పొద్దు మీద’’ అంటూ ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ను అనుకరించి మరొకరు, ‘పుణ్యభూమి నా దేశం’ అంటూ మరొకరు స్ఫూర్తిని రగిలించారు. ఇలా తమ నటన, ఆటపాటలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అదరగొట్టారు. రవీంద్ర భారతీ వేదికగా ఆదివారం జరిగిన ఈ వేడుకలు.. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజ్‌ ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ ఆహార్యంలో చేసిన అభినయంతో మొదలయ్యాయి. ఈ సాంస్కృతిక వేడుకల్లో డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌ ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ అంటూ ఎన్టీఆర్‌లా అభినయించారు. రామచంద్రనాయక్‌ కాసేపటి తర్వాత శోభన్‌బాబు వేషంలో వచ్చి ‘వెల్లువచ్చి గోదారమ్మ’ పాటకు, అలాగే, రామ్‌చరణ్‌ తాజా చిత్రం ‘పెద్ది’లోని ‘రై రా ..’ పాటకు కూడా స్టెప్టులేశారు. ఇక, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌.. కట్టప్పగా మోనో యాక్షన్‌ చేయడంతోపాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కోయ నృత్యాలను చేశారు. ఇక, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఇచ్చిన ప్రదర్శన వేడుకలకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దుర్యోధన పాత్ర ఏకపాత్రాభినయం చేసిన వాకిటి శ్రీహరి.. కుల వివక్ష నిర్మూలన ఆవశ్యకత వివరించేందుకు ఈ అభినయం చేశానని వెల్లడించారు. ‘జజ్జనక జనారే’, ‘దచ్చన్న దారిలో..’ అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పాటలు పాడి అలరించారు. కోయదొర నృత్యాన్ని చేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ.. ఆదివాసీ గీతాలను కూడా ఆలపించారు. వైరా ఎమ్మెల్యే రామదా్‌సమాలోత్‌ లంబాడా నృత్యాలను చేయగా, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు.. గోండి నృత్యాలను చేశారు. అంతకు ముందు మిమిక్రీ కళాకారుడు శివారెడ్డితో పాటు తెలంగాణా సాంస్కృతిక సారధి బృందాలు సాంస్కతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

1.jpg

Updated Date - Mar 30 , 2026 | 06:52 AM