Share News

ఇప్ప సారాకు ఇందిరమ్మ పేరొద్దు!

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:20 AM

ఇప్ప పువ్వు సారా బ్రాండ్‌కు ఇందిరమ్మ పేరు పెట్టొద్దంటూ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఇప్ప సారాకు ఇందిరమ్మ పేరొద్దు!

  • శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారం

  • మండిపడ్డ మంత్రులు.. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

  • ఇందిరను అవమానించారు: దుద్దిళ్ల

  • మహిళలందర్నీ కించపర్చినట్లే: సీతక్క

  • గంట పాటు సభలో గందరగోళం..

  • రికార్డు నుంచి రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలు తొలగిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్‌

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఇప్ప పువ్వు సారా బ్రాండ్‌కు ఇందిరమ్మ పేరు పెట్టొద్దంటూ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గంట పాటు గందరగోళం నెలకొంది. బుధవారం శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై జరిగిన చర్చలో.. ఇప్ప పువ్వు సారా అంశంపై తొలుత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ సారా పథకానికి మాత్రం ఇందిరమ్మ పేరు పెట్టొద్దంటూ వ్యాఖ్యానించారు. ఇప్ప సారా లేదా ఇప్ప టకీలా లేకుంటే మరో పేరు ఏదైనా ఉంటే పెట్టుకోవాలన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, సీతక్క, వాకిటి శ్రీహరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రికార్డుల నుంచి ఆ అభ్యంతకర పదాలను తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఇందిరాగాంధీని బీజేపీ ఎమ్మెల్యే అవమానించారని, ఇలా అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. సీతక్క మాట్లాడుతూ.. మహిళలందర్నీ కించపరిచేలా బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలున్నాయన్నారు. ఇందిరపై బీజేపీకి ఇంకా అక్కసు ఎందుకుని మండిపడ్డారు. ఇందిరను అవమానించడమంటే మొత్తం మహిళా సమాజాన్ని అవమానపర్చడమేనని, ఇందిరను ఉక్కు మహిళ, దుర్గామాతగా వాజ్‌పేయీ అభివర్ణించిన విషయాన్ని పొన్నం గుర్తు చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్‌ స్పందిస్తూ.. క్షమాపణ చెప్పి, ఆ పదాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాలని రాకేశ్‌రెడ్డికి సూచించారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. ఇందిరాగాంధీపై ఉన్న గౌరవంతోనే ఆ పేరు పెట్టొద్దని సూచించానన్నారు. సర్కారు ఆధ్వర్యంలోనే ఇప్పు సారా తయారీ కేంద్రం ఉండాలన్నారు. ప్రతీ పథకానికి సర్కారు ఇందిర పేరును పెడుతోందని, దయచేసి ఈ పథకానికి మాత్రం ఆమె పేరు పెట్టొద్దనే సూచించానన్నారు. అనంతరం రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.


‘ఇప్ప’ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేద్దాం: అనిరుధ్‌రెడ్డి

అంతకుముందు అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇప్ప పువ్వు ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేయాల్సిన అవసరముందని, ఇప్ప పువ్వు మద్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆదివాసీలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఆయుర్వేదంలోనూ ఇప్ప పువ్వు ఔషధ గుణాల ప్రస్తావన ఉందని, మధుమేహం, అల్సర్లు, క్యాన్సర్‌ వంటి వాటికి ఔషధంగా ఉపయోగపడే ఇప్ప పువ్వును ఆర్థిక వనరుగా మలుచుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇప్ప చెట్టు పువ్వుల్లో 70 శాతం సహజ చక్కెర ఉండడం వల్ల ఫర్మెంటేషన్‌కు అనుకూలమని, దీని నుంచి తయారు చేసే మద్యాన్ని ఓ బ్రాండ్‌గా తీర్చిదిద్దే అవకాశముందని వివరించారు. ఇప్ప స్పిరిట్‌, ఇప్ప వైన్‌, ఇప్ప బీర్‌, ఇప్ప పువ్వు టీతోపాటు ఐస్‌క్రీం, లడ్డు, చాక్లెట్లు వంటి ఉత్పత్తులను తయారీని పరిశ్రమగా గుర్తిస్తే ఆదివాసీలకు ఆర్థికంగా చేయూత అందే అవకాశముందన్నారు. ఇప్ప ఉత్పత్తులకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) హక్కులు పొందితే ఇతర ప్రాంతాల్లో ఇదే పేరుతో ఉత్పత్తులు తయారు చేయకుండా రక్షణ లభిస్తుందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లున్నాయని.. ఒక్కో చెట్టు నుంచి 200 కిలోల పువ్వు వస్తుందన్నారు. ఒక్కో ఎకరాలో 50-60 మొక్కలు వేసుకోవచ్చని, రూ.3 లక్షల మేర ఆదాయం సమకూరుతుందని వివరించారు.

Updated Date - Mar 26 , 2026 | 05:20 AM