Share News

ఎల్‌బీ నగర్‌ -హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:57 AM

నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర) తరహాలో హైదరాబాద్‌లో ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ వరకు రూ.950 కోట్లతో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

ఎల్‌బీ నగర్‌ -హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌

  • కేంద్రం అనుమతి రాగానే శంకుస్థాపన

  • మంత్రి కోమటిరెడ్డి

హయత్‌ నగర్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర) తరహాలో హైదరాబాద్‌లో ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ వరకు రూ.950 కోట్లతో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించగానే ముఖ్యమంత్రితో కలిసి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. శనివారం హయత్‌ నగర్‌లోని ఓల్డ్‌ నేషనల్‌ హైవే సాయిబాబా దేవాలయం నుంచి జీ స్కూల్‌ వరకు రూ.10 కోట్లతో చేపడుతున్న నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ కోసం రాష్ట్ర వాటాగా రూ.200 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. దాని నిర్మాణంతో హైదరాబాద్‌ ఈస్ట్‌ రూపురేఖలు మారిపోతాయన్నారు. హయత్‌నగర్‌, తారామతిపేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, ఇంజాపూర్‌, కొహెడ పండ్ల మార్కెట్‌ ప్రాంతాల్లో అన్ని రోడ్లను నాలుగు లేన్లుగా మారుస్తామని తెలిపారు. రూ.10 వేల కోట్లతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు సర్వీస్‌ రోడ్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో మూసీ నది సుందరీకరణను చేపట్టి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయేవారికి పునరావాసం కల్పిస్తామని హమీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ హయాంలో బస్సు చార్జీలకు డబ్బులు లేని వ్యక్తులు అవినీతికి పాల్పడి వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ నిధులన్నీ ఆంధ్రాకు తరలించి వారి పట్టణాలను అభివృద్ది చేసుకున్నారన్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్‌, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి పట్టువదలకుండా డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ సాధించారన్నారు. రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు టీడీఆర్‌ ఇప్పించాలని మంత్రిని కోరారు.

Updated Date - Mar 15 , 2026 | 05:57 AM