Normool: నార్మూల్‌లో అవకతవకలపై న్యాయపోరాటం
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:55 PM
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్ (నార్మూల్) అవకతవకలు జరిగాయంటూ తాజా మాజీ చైర్మన్, పలువురు డైరెక్టర్లు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
సన్నాహాలు చేస్తున్న నార్మూల్ మాజీ చైర్మన్, పలువురు డైరెక్టర్లు
ప్రభుత్వంతోపాటు విజిలెన్స్, ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్ (నార్మూల్) అవకతవకలు జరిగాయంటూ తాజా మాజీ చైర్మన్, పలువురు డైరెక్టర్లు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. కొన్నేళ్లుగా పాలకవర్గాలు తీసుకున్న నిర్ణయాలు, అధికారుల తప్పిదాలు, అవినీతితో మదర్‌డెయిరీ అప్పుల ఊబిలో చిక్కుకుందుని, దీనిపై సమగ్ర విచారణకు పలువురు డైరెక్ట ర్లు పట్టుపడుతున్నారు. నిజాలు తేల్చేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మదర్ డెయిరీ 1983లో ప్రారంభం కాగా, 2014 నాటికి రూ.11కోట్ల లాభాల్లో ఉంది. ఆతరువాత సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోవడానకి ప్రధాన సూత్రధారులు ఎవరనేది తేల్చాలని నార్మూల్ మాజీ చైర్మన్‌తో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి సర్కారు దృష్టికి తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎవరి హయాంలో ఎంత మేరకు నష్టం జరిగింది? ఆయా పాలకవర్గాలు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. నార్మూల్‌లో జరిగిన నష్టాలపై నిజనిర్ధార ణ జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నా రు. పూర్తిస్థాయి సమాచారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఏసీబీ, విజిలెన్స్ సంస్థలతో విచారణ చేపట్టాలని విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే సీబీఐతో విచారణ చేయించాలని తాజా మాజీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అందుకు విచారణ సంస్థలకు సమగ్ర ఆధారాలు సమర్పించనున్నట్టు వెల్లడించారు.
రూ.70కోట్ల నష్టాల్లో..
నార్మూల్ ప్రస్తుతం రూ.70కోట్ల నష్టాల్లో ఉండగా, వీటిలో రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.23కోట్లు, బ్యాంకుల్లో అప్పులు రూ.47కోట్ల మేర ఉన్నాయి. పాడి రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రోజురోజుకూ పాలసేకరణ గణనీయంగా పడిపోతోం ది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో విసిగి వేసారిన రైతులు ప్రైవేట్ డెయిరీలను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు 1.20లక్షల లీటర్లు పాల సేకరణ జరిగ్గా, ప్రస్తు తం 40వేల లీటర్లు మాత్రమే శీతలీకరణ కేంద్రాలకు వస్తున్నాయి. బిల్లులు ఇలాగే జాప్యం చేసిన పక్షంలో రైతులంతా నార్మూల్‌కు దూరమై సంస్థ మనుగడ ముందుకు సాగని పరిస్థితి నెలకొంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా నార్మూల్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రైతులు కోరుతున్నారు. సంస్థలో పనిచేస్తున్న 500మంది ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని, సంస్థను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
కొత్త పాలకవర్గానికి సవాళ్ల స్వాగతం
మదర్ డెయిరీలో నెలకొన్న అప్పులతో పాడి రైతులకు బిల్లుల చెల్లింపు కష్టతరంగా మారింది. నెలల తరబడిగా పాల బిల్లుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రైతులకు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో పశు పోషణకు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నార్మూల్ పరిధిలో మొత్తం 290 పాల సంఘాలు ఉన్నాయి. పాల సంఘాల ద్వారా నిత్యం 60వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. పాడి రైతులకు రూ.23కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రైతులకు తక్షణం రూ.12కోట్ల మేర డబ్బు చెల్లిస్తానని ప్రస్తుత చైర్మన్ మందడి ప్రభాకర్‌రెడ్డి ముందుకు రావడంతో ఇప్పటి వరకు చైర్మన్‌గా ఉన్న మధుసూదన్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ డబ్బును ఈ నెల 25లోగా రైతులకు చెల్లిస్తే, మూడు, నాలుగు బిల్లులు రైతులకు చేరుతాయి. అయితే మిగతా బిల్లులు చెల్లించాలంటే మరో రూ.13కోట్లు కావాల్సి. ఈ నేపథ్యంలో రైతులకు సకాలంలో డబ్బు చెల్లించడం ప్రస్తుత పాలకవర్గానికి సవాలే. ఒక్కో రైతుకు కనీసం రూ.5వేల నుంచి రూ.20వేల వరకు బకాయిలు ఉన్నాయి. బిల్లులన్నీ పూర్తిగా చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
నార్మూల్ ఎండీని తొలగిస్తేనే మనుగడ
తాజా మాజీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి
నార్మూల్ ఎండీ అవినీతికి హద్దేలేదని, ఆయన తప్పుడు నిర్ణయాలతోనే సంస్థ నష్టాల్లో చిక్కుకుందని తాజా మాజీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం విలేకరుల స మావేశంలో మాట్లాడుతూ, సంస్థలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు రైతుల రక్తం తాగుతున్నారని, దొంగకే ఇంటి తాళలు ఇచ్చినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత పాలకు లు ఉద్యోగులకు ఇష్టారాజ్యంగా పద్నోతులు కల్పించారని, అర్హతలేని వారికి ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. మ్యాక్స్ 1964 చట్టాన్ని అడ్డం పెట్టుకుని,ఏకపక్షంగా బోర్డు నిర్ణయాలు తీసుకొని సంస్థ ను పీకల్లోతు నష్టాల్లో ముంచారని ఆరోపించారు. సంస్థ 2023-24లో రూ.35కోట్ల మేరకు నష్టాల్లో ఉండగా, సంవత్సరానికి రూ.1.84కోట్ల లాభాల్లో ఉన్నట్టు తప్పుడు ఆడిట్‌ను రూపొందించారని ఆరోపించారు. గత పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టడంతో ఈ విషయం తేలిందన్నారు. రూ.10కోట్ల మేర అవకతవకలు జరిగాయని, దీనికి ప్రధాన కారణం ఎండీ ఏకపక్ష నిర్ణయాలే అని అన్నారు. డెయిరీని ఎన్‌డీబీబీకి అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎండీతోపాటు పలువురు డైరెక్టర్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏసీబీ కేసు నమోదై, కల్తీ పాలు విక్రయించి ఎస్‌వోటీ పోలీసులకు చిక్కిన ఉద్యోగికి ఎండీ పదవిని అప్పగించారని ఆరోపించారు. ఎం డీ పదవికి రాజీనామా చేసిన వ్యక్తిని, కొంతమంది మరోసారి ఇన్‌చార్జీగా అవకాశం కల్పించారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలను ప్రభుత్వం, ఏసీబీ, విజిలెన్స్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.