నేరాల అదుపునకే చట్టాలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:01 PM
నేరాలను అదుపు చేయడానికే చట్టాలు పని చేస్తాయని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సంకేత్‌మిత్ర అన్నారు. బెజ్జూరు, సలుగుపల్లి, కుంటలమానేపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఆదివారం న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
బెజ్జూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నేరాలను అదుపు చేయడానికే చట్టాలు పని చేస్తాయని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సంకేత్‌మిత్ర అన్నారు. బెజ్జూరు, సలుగుపల్లి, కుంటలమానేపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఆదివారం న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజ క్రమబద్దీకరణ, శాంతియుతం కోసమే చట్టాలు ఉన్నాయని వివరించారు. చట్టాల వల్ల రక్షించబడతామని చెప్పారు. చట్టాలు లేకుంటే నేర వ్యవస్థ పెరుగుతుందని అన్నారు. సమాజంలో మంచి పౌరులుగా ఎదగడానికి చదువు ఎంతో అవసరమని విద్యార్థులు గుర్తించాలని సూచించారు. చదువు చట్టాలను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుందని అన్నారు. చట్టాన్ని గౌరవించినప్పుడే చదువుకు అర్థముంటుందన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. చట్టాన్ని ఎవ్వరు కూడా చేతుల్లోకి తీసుకోకూడదని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై సర్తాజ్‌పాషా, హెచ్‌ఎంలు మారుబాయి, రమేష్, వార్డెన్లు శ్రీనివాస్, సునీత పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
పెంచికల్‌పేట, జూలై 19 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చట్టాలపై పూర్తి అవగాహన పెంపొందించుకొని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సంకేత్‌మిత్ర సూచించారు. ఎల్లూరు ఆశ్రమ పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్, గుట్కా, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిస కావద్దన్నారు. వీటికి దూరంగా ఉండాలన్నారు. ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకుని చదువు కొనసాగించాలని సూచించారు. అనంతరం చైల్డ్ లేబర్, పోక్సో చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో మొక్కను నాటారు. కార్యక్రమంలో ఎస్సై అనిల్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆశోక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.