Share News

పొంగులేటిపై తప్పుడు ఆరోపణలా?

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:34 AM

మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిపై నిరాధార ఆరోపణలు చేసిన కేటీఆర్‌, హరీశ్‌రావు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ విప్‌లు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు...

పొంగులేటిపై తప్పుడు ఆరోపణలా?

  • కేటీఆర్‌, హరీశ్‌ రావు బహిరంగ క్షమాపణలు చెప్పాలి

  • ప్రభుత్వ విప్‌లు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల డిమాండ్‌

హైదరాబాద్‌, మార్చి 31(ఆంధ్రజ్యోతి): మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిపై నిరాధార ఆరోపణలు చేసిన కేటీఆర్‌, హరీశ్‌రావు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ విప్‌లు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ విప్‌లు వేముల వీరేశం, విజయరమణారావు, బీర్ల అయిలయ్య, ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మందుల సామేలు, పాయం వెంకటేశ్వర్లు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసత్య ఆరోపణలు చేశారని వేముల వీరేశం ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిజానికి రాఘవ కంపెనీకి అసలు మైనింగ్‌, క్రషర్‌ లేదన్నారు. తిరుమల కన్‌స్ట్రక్షన్‌ పేరుతో క్రషర్‌ ఉందని, దాని నుంచి రాఘవ కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌ను కొనుగోలు చేస్తోందన్నారు. క్రషర్‌ వ్యవహారం తప్పు అని తేలడంతోనే కేటీఆర్‌, హరీశ్‌.. వట్టి నాగులపల్లికి వెళ్లి విమర్శలు చేస్తున్నారన్నారు. పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి 2013లోనే రాఘవ కన్‌స్ట్రక్షన్‌ నుంచి బయటికి వచ్చేశారని, 2014లో ఆయన భార్య, కొడుకు కూడా బయటికి వచ్చేశారని చెప్పారు. ల్యాండ్‌ డెవల్‌పమెంట్‌ అంశంలోని భూవివాదం న్యాయస్థానంలో ఉండగా అసెంబ్లీలో ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. ఇక, విజయరమణారావు మాట్లాడుతూ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు పొంగులేటికి సంబంధం లేకపోయినా ఏదో జరుగుతోందని రాద్దాంతం చేస్తున్నారన్నారు. సభలో గొంతు నొక్కితే హరీశ్‌ రావు 4.16 గంటలు, కేటీఆర్‌ 1.14 గంటల పాటు ఎలా మాట్లాడగలిగారని ప్రశ్నించారు. బీర్ల అయిలయ్య మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని తట్టుకోలేకనే కేటీఆర్‌, హరీశ్‌రావు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ సభ నుంచి సస్పెండ్‌ కావాలనే ఉద్దేశంతోనే పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అంశాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రస్తావించారన్నారు. సభలోనే ఉంటే సన్నబియ్యం భోజనం చేయాల్సి వస్తుందని, చేయకుంటే పేదల నుంచి వ్యతిరేకత వస్తుందనే వారు సస్పెండ్‌ అయ్యారన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు సభలో 16 గంటలు మాట్లాడితే.. కాంగ్రెస్‌ సభ్యులు మాట్లాడింది కేవలం 13 గంటలేనన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వల్ల సభా సమయం 4.56 గంటలు వృథా అయిందన్నారు. ఇక, తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ కేటీఆర్‌, హరీశ్‌రావు హైదారాబాద్‌లో వారికి ఉన్న ఆస్తుల వివరాలను ధర్మంగా చెప్పాలన్నారు. హరీశ్‌ రావు ఎవరినైనా బ్లాక్‌ మెయిల్‌ చేస్తారని అందులో భాగంగానే పొంగులేటిపై అపోహలు సృష్టిస్తున్నారని తెలిపారు. పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమించుకున్న భూములను చట్టబద్ధం చేసుకునేందుకే మంత్రి పొంగులేటిని కేటీఆర్‌, హరీశ్‌రావు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్నారు. కాగా, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదని పార్లమెంటులో కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ తేల్చి చెప్పారని, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలు తమ మఖాలను ఎక్కడ పెట్టుకుంటారని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత అజెండాను ముందుకు తెచ్చారని కేటీఆర్‌, హరీశ్‌రావుపై వారి పార్టీ ఎమ్మెల్యేలే విసుక్కుంటున్నారని ఆరోపించారు.

Updated Date - Apr 01 , 2026 | 04:34 AM