తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న లేటు వయసు పెళ్లిళ్లు..
ABN , Publish Date - Apr 05 , 2026 | 05:39 AM
ఆమె తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఐఏఎస్ అధికారిణి.. భర్త అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బోలెడంత సంపద.. సమాజంలో హోదా అన్నీ ఉన్నాయి. కానీ..
కెరీర్‌లో స్థిరపడ్డాకే వైవాహిక బంధంలోకి
మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నవారిలో
90ుమంది.. 28 ఏళ్లు, అంతకు పైబడ్డవారే
25 ఏళ్లలోపు ఉన్న వారి ప్రొఫైల్స్ 2 శాతమే
మహిళలకు 30 ఏళ్లు దాటితే.. గర్భధారణ
అవకాశాలు 40ు తగ్గుతాయి: వైద్యులు
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ఆమె తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఐఏఎస్ అధికారిణి.. భర్త అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బోలెడంత సంపద.. సమాజంలో హోదా అన్నీ ఉన్నాయి. కానీ.. ఆ దంపతులకు ఇప్పుడు ఒకే ఒక్క చిక్కువచ్చి పడింది. అది వారి 32 ఏళ్ల కుమారుడి పెళ్లి. ‘కెరీర్‌లో ఎదగాలి.. పూర్తిస్థాయిలో సెటిల్ అవ్వాలి’ అంటూ ఆ యువకుడు పెళ్లి మాట ఎత్తితేనే దాటవేస్తున్నాడు. ఇది కేవలం ఆ ఒక్క కుటుంబం సమస్య కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం యువతలో కనిపిస్తున్న ధోరణి ఇది. పెద్దల ఒత్తిడి కారణంగానో, కెరీర్ గురించి పెద్దగా ఒత్తిళ్లు లేకపోవడం వల్లనో.. ఒకప్పుడు 25 ఏళ్లు దాటకుండానే పెళ్లి ఆలోచన చేసే యువత.. ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లి పీటలెక్కడానికి సిద్ధపడట్లేదు. కెరీర్‌లో స్థిరపడ్డాకే పెళ్లి అనే ధోరణి పెరిగిపోతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మ్యాట్రిమొనీ పోర్టల్స్ డేటాను పరిశీలిస్తే.. 2020 తర్వాత రిజిస్టర్ చేసుకున్న వారిలో 70 శాతం మంది 30 ఏళ్లు పైబడిన వారే. గత ఐదేళ్లలో నమోదైన ప్రొఫైల్స్‌లో 25 ఏళ్లలోపు యువకులవి కేవలం 2శాతమే ఉన్నాయి. 90శాతానికి పైగా ప్రొఫైల్స్.. 28 ఏళ్లు, అంతకు పైబడినవారివే. అబ్బాయిలు సగటున 32-35 ఏళ్ల మధ్య, అమ్మాయిలు 28-31 ఏళ్ల మధ్య వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారని హైదరాబాద్‌కు చెందిన ఒక మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు తెలిపారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో 30-35 ఏళ్ల వయసు ఉండి ఇంకా వివాహం చేసుకోని యువత సంఖ్య గత దశాబ్దంతో పోల్చితే 32 శాతం పెరిగింది. అయితే.. జీవితంలో కెరీర్ ఎంత ముఖ్యమో.. వైద్యపరంగా తగిన వయసులో వివాహం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని వైద్యనిపుణులు అంటున్నారు.
స్థిరత్వం ముఖ్యమేగానీ..
జీవితంలో స్థిరపడడం ముఖ్యమేగానీ.. ఎంత మూల్యానికి అనేది ప్రశ్న! ఒకప్పుడు ఇంట్లో ఒక్క సైకిల్ ఉన్నా అదో గొప్ప విశేషంగా ఉండేది. ఇప్పుడు.. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కార్లు! ఉమ్మడి కుటుంబాల్లో చిన్న గదిలో సర్దుకుపోయే కాలం పోయి ప్రతి ఒక్కరికీ విడివిడి పడగ్గదులు ఉండే విల్లాలు, పెద్ద పెద్ద ఫ్లాట్లు కావాలనే తపన పెరగడమే ఈ సమస్యకు కారణం. ఈ విలాసవంతమైన జీవితం కోసం యువత విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరుగులో పడి వివాహం అనేది వారి ప్రాధాన్య అంశాల జాబితాలో చివరి అంశంగా మారుతోంది. ఉదాహరణకు.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక యువతి అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో స్థాయికి చేరింది. 35ఏళ్ల ప్రాయంలో ఆమె కెరీర్ శిఖరాగ్రాన ఉంది. కానీ.. ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తట్లేదు. అదేమంటే.. ‘నాకా కోరిక లేదు’ అని నిర్వేదంగా సమాధానమిస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన సృజన్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి సివిల్స్ సాధించాలనే పట్టుదలతో ఢిల్లీ వెళ్లి ఎనిమిదేళ్లపాటు శ్రమించాడు. ఫలితం దక్కకపోవడంతో తిరిగి వచ్చి హైదరాబాద్‌లో సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నాడు. కానీ.. ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే సంబందాలు రావడంలేదు. కారణం.. అతడి వయస్సు ఇప్పుడు 37 ఏళ్లు. వయసు మించిపోవడం ఒక కారణమైతే.. స్థిరమైన ఉద్యోగం లేక వ్యాపారిగా ఉండటం మరో అడ్డంకిగా మారింది. ఇలా కెరీర్ వెనుక పరిగెత్తి చివరకు ఒంటరిగా మిగిలిపోతున్న యువతీయువకులు పల్లెపట్టణాల్లో వేల సంఖ్యలో కనిపిస్తున్నారు. విజయవాడకు చెందిన అనిరుధ్‌ది మరో విచిత్రమైన పరిస్థితి. ప్రస్తుతం బెంగళూరులో ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్న అతడు నెలకు రూ.2లక్షలు సంపాదిస్తున్నాడు. తండ్రి రిటైర్డ్ ఉద్యోగి. కొడుకు పెళ్లి కోసం ఐదేళ్లుగా సంబంధాలు చూస్తున్నారు. కానీ.. అనిరుధ్ మాత్రం ‘ఇంకో ప్రమోషన్ రావాలి.. సొంతంగా విల్లా కొనాలి’.. అప్పుడే పెళ్లి చేసుకుంటా అని వాయిదా వేస్తూ వచ్చాడు. తీరా ఇప్పుడు పెళ్లికి సిద్ధపడితే.. చాలామంది అమ్మాయిలు ‘వయసు తేడా మరీ ఎక్కువ ఉంది’ అని తిరస్కరిస్తున్నారు. 36 ఏళ్ల ప్రణతి విశాఖలోనే ఒక ప్రముఖ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కెరీర్, ట్రావెలింగ్ హాబీ అంటూ.. పెళ్లి ఊసెత్తకుండా ఇన్నాళ్లూ కాలం గడిపేసిన ఆమెకు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉన్నా.. సమాన స్థాయి ఉన్న అబ్బాయిలు దొరకట్లేదు.
ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు..
వైద్యశాస్రం ప్రకారం.. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు సంతానోత్పత్తికి అత్యంత అనువైన సమయం. 30 ఏళ్లు దాటిన మహిళల్లో అండాల నాణ్యత తగ్గడం వల్ల సహజంగా గర్భం దాల్చే అవకాశం 40శాతం మేర తగ్గిపోతుందని.. ఇలా ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల చాలా మంది దంపతులు ఐవీఎఫ్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లోనే కాక.. జిల్లా కేంద్రాల్లోనూ గల్లీకో ఐవీఎఫ్ సెంటర్స్ వెలవడానికి ప్రధాన కారణం ‘లేట్ మ్యారేజ్’లేనని వారు చెబుతున్నారు.
23 ఏళ్లకే పెళ్లి.. 46 ఏళ్లకే తాత..
ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలోని ఇద్దరు స్నేహితుల భిన్నమైన జీవితాలు ప్రస్తుత తరానికి ఆసక్తికరమైన పాఠాలు నేర్పుతాయి. 1972లో జన్మించిన ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒకరు 23 ఏళ్లకే పెళ్లి చేసుకుని, తన 46వ ఏటనే తాత అయ్యాడు. 54 ఏళ్ల వయసులో ఇప్పుడు మనువళ్లతో ఆడుకుంటూ యంగ్ తాతగా పిలిపించుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. నిజానికి అతడు కూడా.. సెటిల్ అయ్యాకే వివాహం చేసుకోవాలని భావించాడు. కానీ.. ‘30 ఏళ్లు వచ్చినా సెటిల్ కాకపోతే?’ అంటూ తండ్రి అడిగిన ఒకే ఒక ప్రశ్న అతణ్ని ఆలోచింపజేసింది. దీంతో అతడు 23వ ఏట పెళ్లి చేసుకున్నాడు. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే కెరీర్‌లోనూ అంచెలంచెలుగా ఎదిగాడు. అతడి పిల్లలు సైతం చదువు పూర్తిచేసుకుని కెరీర్‌లో స్థిరపడ్డారు. అదే గ్రామంలోని అతడి స్నేహితుడు.. 35 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు అతడి కుమార్తె చదువే ఇంకా పూర్తి కాలేదు. అతడు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలిపోయాయి.