లాసెట్ షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:46 AM
వచ్చే విద్యా సంవత్సరంలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్‌సెట్-2026 షెడ్యూల్ విడుదలైంది.
హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ/కేయూ క్యాంపస్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరంలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్‌సెట్-2026 షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మి, ఓయూ వీసీ, లాసెట్ చైర్మన్ కుమార్ మొలుగరం నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సెట్ దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల తేదీలు, సిలబస్ వంటి అంశాలను చర్చించి ఆమోదించారు. షెడ్యూల్‌ను విడుదల చేశారు. పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా జరుగుతాయి. నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 8న విడుదల చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 10న ప్రారంభమవుతుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ఏప్రిల్ 1 వరకు, ఆలస్య రుసుముతో మే 13 వరకు ఉంది. ప్రవేశ పరీక్షలు మే 18న ఉదయం 9:30-11 గంటల వరకు, మధ్యాహ్నం 12:30-2 గంటల వరకు (మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ), సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) జరుగుతాయి. మరిన్ని వివరాలను ఫిబ్రవరి 8 తర్వాత http://www.lawcet.tghce.ac.in/ అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఫిబ్రవరి 9 నుంచి ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ..
డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్) విద్యార్థులు బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ(ప్రవేశాల) కోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఉస్మానియా యూనివర్సిటీ ఈసెట్-2026 షెడ్యూల్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకానుంది. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 18లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500, ఇతరులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. మే 15న ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష జరగనుంది. మరిన్ని వివరాలకు http://www.ecet.tghce.ac.in/అనే వెబ్‌సైట్‌ను ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత సందర్శించవచ్చని టీజీఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.