Share News

ల్యాప్‌టాప్‌ ధరలు పైపైకి!

ABN , Publish Date - May 23 , 2026 | 05:36 AM

అసలే కృత్రిమ మేధ కాలం. ల్యాప్‌టాప్‌ లేకపోతే సమాజంతో పోటీ పడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ల్యాప్‌టా్‌పల ధరలు అంతకంతకూ పెరుగుతూ పోవడం ఆందోళన కలిగిస్తోంది.

ల్యాప్‌టాప్‌ ధరలు పైపైకి!

  • నెల రోజుల్లోనే దాదాపు 30శాతం పెరుగుదల

  • ఇంకా 10శాతం పెరుగుతాయని అంచనాలు

  • చిప్‌ల కొరత, రూపాయి పడిపోవడం వల్లే

  • బేసిక్‌ ల్యాప్‌టా్‌పలకు తగ్గుతున్న డిమాండ్‌

  • ఏఐ నేపథ్యంలో హై డెఫినెషన్‌వైపే మొగ్గు

  • ల్యాప్‌టాప్‌ ఉత్పత్తి కూడా ఆ మేరకే

హైదరాబాద్‌ సిటీ, మే 22(ఆంధ్రజ్యోతి): అసలే కృత్రిమ మేధ కాలం. ల్యాప్‌టాప్‌ లేకపోతే సమాజంతో పోటీ పడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ల్యాప్‌టా్‌పల ధరలు అంతకంతకూ పెరుగుతూ పోవడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని ల్యాప్‌టాప్‌ కొందామనుకున్నవారిని పెరుగుతున్న ధరలు భయపెడుతున్నాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ల్యాప్‌టా్‌పల ధరలు దాదాపు 30శాతం వరకు పెరిగాయి. ఇంకా 10శాతం పెరగవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ల్యాప్‌టా్‌పల తయారీలో ఉపయోగించే చిప్‌ల కొరత, ర్యామ్‌, జీపీయూల ధరలు పెరగడం, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. రోజురోజుకు పడిపోతున్న రూపాయి విలువ కూడా ల్యాప్‌టా్‌పల ధరలు పెరగడానికి కారణమన్నారు. ల్యాప్‌టాప్‌ బేసిక్‌ కాన్ఫిగరేషన్‌ అయినా, గేమింగ్‌ ల్యాప్‌టా్‌పలు అయినా ధరలు 30శాతం వరకు పెరిగాయని హైదరాబాద్‌లోని సీటీసీలో ఉన్న ఓ సుప్రసిద్ధ ల్యాప్‌టాప్‌ కంపెనీ డీలర్‌ అగర్వాల్‌ తెలిపారు. ‘‘లెనెవో, హెచ్‌పీ ఇలా ఏ కంపెనీ తీసుకున్నా బేసిక్‌ ల్యాప్‌టాప్‌ గతంలో రూ.25-రూ.30 వేలు పెడితే వచ్చేది. ఇప్పుడు మాత్రం రూ.35-రూ.40 వేలు పెట్టాల్సి వస్తోంది. అయినా కూడా ఇప్పుడు బేసిక్‌ ల్యాప్‌టా్‌పలు దొరుకుతాయన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే, ఆ తరహా ల్యాప్‌టా్‌పల ఉత్పత్తిని కంపెనీలు తగ్గిస్తున్నాయి’’ అని అన్నారు. ఇండియాలో ఏర్పాటవుతున్న డాటా సెంటర్లు, ఏఐ విప్లవం కారణంగా బేసిక్‌ ల్యాప్‌టా్‌పల కోసం ఆర్డర్లు ఇచ్చే కంపెనీల సంఖ్య తగ్గుతోందని, అందువల్ల కంపెనీలు హైడెఫినెషన్‌ ల్యాప్‌టా్‌పల తయారీకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాయని తెలిపారు. పరిశ్రమ వర్గాల ప్రకారం ల్యాప్‌టా్‌పల ధరలు గత డిసెంబర్‌లో స్వల్పంగా ధరలు పెరిగాయి కానీ, ఇరాన్‌ యుద్ధం మొదలైన తరువాత వేగంగా పెరుగుతున్నాయి.

కొనుగోళ్లు వాయిదా!

పెరిగిన ధరల నేపథ్యంలో ల్యాప్‌టా్‌పలను కొనుగోలు చేయాలనుకున్న వినియోగదారులు తమ ఆలోచనలను వాయిదా వేసుకోవడమో, విరమించుకోవడమో చేస్తున్నారు. ‘‘మేం కొనాలనుకున్న ల్యాప్‌టా్‌పకు కొద్దిరోజుల క్రితం రూ.40వేలు అవుతుంది అన్నారు. కానీ, ఇప్పుడు రూ.55వేలు చెప్తున్నారు. దీంతో, ల్యాప్‌టాప్‌ కొనాలనుకున్న నిర్ణయాన్ని వాయుదా వేసుకున్నాం’’ అని హైదరాబాద్‌లోని రహ్మత్‌నగర్‌కు చెందిన శేఖర్‌ చెప్పారు. ఇలా చాలా మంది కొనుగోళ్లన వాయిదా వేసుకుంటున్నారు. అయితే, ధరలు ఇప్పట్లో తగ్గబోవని, 2027వరకు ఇలాగే కొనసాగుతాయని మార్కెట్‌ వర్గాల అంచనా.

Updated Date - May 23 , 2026 | 05:36 AM