Share News

Land Mafia: కొల్లూరులో అర్ధరాత్రి భూ మాఫియా వీరంగం

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:34 AM

కోకాపేట భూముల ధరలు ఇటీవల ఎకరానికి రూ.151 కోట్లకుపైగా పలకడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై భూకబ్జాల మాఫియా కన్ను వేసింది.

Land Mafia: కొల్లూరులో అర్ధరాత్రి భూ మాఫియా వీరంగం

  • రూ.300 కోట్లకుపైగా విలువైన భూమి కబ్జాకు యత్నం

  • బ్లూషీట్లు, ఇతర సామగ్రితో సహా..ప్రణాళికతో 200 మంది దుండగులు

  • సిబ్బందిపై దాడి.. 26 మందిపై కేసు

రామచంద్రాపురం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): కోకాపేట భూముల ధరలు ఇటీవల ఎకరానికి రూ.151 కోట్లకుపైగా పలకడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై భూకబ్జాల మాఫియా కన్ను వేసింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో గురువారం రాత్రి సుమారు రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. పక్కా ప్రణాళికతో వచ్చిన 200 మంది దుండగులు రాత్రి 9:30 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు వీరంగం సృష్టించారు. కొల్లూరులోని సర్వే నంబర్‌ 192లో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. తొలుత ఆ భూమి వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డులపై దాడి చేశారు. వారిని బలవంతంగా ఓ వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లి.. నార్సింగి ప్రాంతంలో విడిచిపెట్టారు. తర్వాత ఆ భూమి వద్ద కొత్తగా ప్రహారీ నిర్మించడానికి రెండు డీసీఎం వ్యాన్లలో బ్లూషీట్‌ రేకులను, ఇతర సామగ్రిని తీసుకువచ్చారు. అక్కడ పనిచేస్తున్న దంపతులను వెంటనే వెళ్లిపోవాలని, లేకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. కానీ ఆ దంపతులు అక్కడే ఉండిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకుని, దుండగులను అదుపులోకి తీసుకున్నారు. సర్వే నంబరు 192లో ఉన్న 5.12 ఎకరాల భూమి తనదేనని, 1999లో దానిని కొనుగోలు చేశానని భూయజమానురాలు మాధవి పోలీసులకు వివరించారు. గురువారం రాత్రి కొందరు దుండగులు తన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, ప్రహారీని కూల్చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, 26 మందిని అదుపులోకి తీసుకున్నామని స్థానిక సీఐ సీఐ గణేష్‌ పటేల్‌ తెలిపారు.

Updated Date - Jan 10 , 2026 | 05:34 AM