Share News

జబ్బు రాకముందే జాగ్రత్తలు

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:41 AM

ప్రతి పౌరుడికీ నాణ్యమైన వైద్యం అందాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘లాన్సెట్‌ సిటిజన్స్‌ కమిషన్‌’.. భారతదేశ ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పుల కోసం సరికొత్త..

జబ్బు రాకముందే జాగ్రత్తలు

  • ఆసుపత్రుల చుట్టూ తిరిగే ‘సిక్‌ కేర్‌’ కాదు ముందస్తు నివారణే లక్ష్యం కావాలి

  • ఆరోగ్య రంగంలో డిజిటల్‌ విప్లవం రావాలి!

  • ప్రభుత్వ నిధుల్లో 80శాతాన్ని వైద్యపరీక్షలు,వ్యాధి గుర్తింపు కోసం కేటాయించాలి

  • లాన్సెట్‌ సిటిజన్స్‌ కమిషన్‌ నివేదికలో ప్రతిపాదన

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ప్రతి పౌరుడికీ నాణ్యమైన వైద్యం అందాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘లాన్సెట్‌ సిటిజన్స్‌ కమిషన్‌’.. భారతదేశ ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పుల కోసం సరికొత్త రోడ్‌మ్యా్‌పను సిద్థం చేసింది. కొవిడ్‌ మహమ్మారి మన వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపిన నేపథ్యంలో.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రధాన ఆయుధంగా చేసుకుని వైద్య రంగాన్ని ఎలా పునర్నిర్మించవచ్చో ఆ కమిషన్‌లోని ప్రముఖ శాస్త్రవేత్తలు, నిపుణులు తమ నివేదికలో స్పష్టం చేశారు. భారత్‌లో వైద్య రంగం కేవలం ఆసుపత్రులు, ల్యాబ్‌ల చుట్టూ తిరిగే ‘సిక్‌ కేర్‌’ (రోగం వచ్చాక చూసే వైద్యం)లా ఉందని, అలా కాకుండా, వ్యాధి రాకుండా చూసుకునే ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌’ (ఆరోగ్య సంరక్షణ) వైపు మళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందులో వారు పేర్కొన్నారు. ఆ దిశగా

  • వైద్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఐదు ముఖ్యమైన సాంకేతిక సూత్రాలను ప్రతిపాదించారు.వైద్య సేవలు పౌరుల అవసరాలకు అనుగుణంగా మారాలి. ప్రాథమిక వైద్యాన్ని ఇళ్ల వద్దకే తీసుకురావడానికి మొబైల్‌ ఫోన్లు, డిజిటల్‌ టూల్స్‌ వాడాలి.

  • ప్రస్తుతం ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎమ్‌లు కేవలం డేటా ఎంట్రీ, ఫారాలు నింపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీనికి బదులు డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు, టెలిమెడిసిన్‌ ద్వారా వారి సమయాన్ని రోగుల సంరక్షణకు ఉపయోగపడేలా చేయాలి.

  • వైద్య రంగంలో జరిగే తప్పులను, అవినీతిని అరికట్టడానికి సాంకేతికతను ఒక రక్షణ కవచంగా వాడాలి. రోగుల వ్యక్తిగత ఆరోగ్య సమాచారానికి పూర్తి భద్రత కల్పించాలి.

  • మధుమేహం, క్షయ వంటి వ్యాధుల నిర్వహణ కోసం స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కొత్త డిజిటల్‌ పరిష్కారాలను కనిపెట్టి, వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలించాలి.

80-20 ఫార్ములా..

ప్రస్తుతం ప్రభుత్వం వైద్యం కోసం కేటాయించే నిధుల్లో సింహభాగం.. రోగం ముదిరిన తర్వాత ఇచ్చే చికిత్సలకే ఖర్చవుతోంది. దీనివల్ల రోగులపై ఆర్థిక భారం పెరుగుతోంది. దీనికి బదులుగా, బడ్జెట్‌లో 80 శాతం నిధులను ముందస్తు స్ర్కీనింగ్‌, వ్యాధి గుర్తింపునకే కేటాయించాలని నివేదిక స్పష్టం చేసింది. పౌరుల ఆరోగ్య రికార్డులను డిజిటల్‌ హెల్త్‌ లాకర్ల ద్వారా భద్రపరచాలని సూచించింది. ఏ రోగి తన మానసిక ఆరోగ్య సమాచారాన్ని ఇతరులకు చూపించకూడదనుకుంటారో, దాన్ని వేరుగా ఉంచే నియంత్రణ అధికారం పూర్తిగా ఆ పౌరుడికే ఉండాలని ఈ కమిషన్‌ ప్రతిపాదించింది. ఆయుష్‌ వంటి సంప్రదాయ వైద్య విధానాలను కూడా ఆధునిక వైద్యంతో శాస్త్రీయంగా అనుసంధానించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు సమర్థంగా చికిత్స చేయవచ్చని పేర్కొంది.

Updated Date - Jul 06 , 2026 | 03:41 AM