లంబాడీల ఎస్టీ రిజర్వేషన్లకు 50 ఏళ్లు
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:53 AM
రాష్ట్రంలో లంబాడీ, ఎరుకల, యానాది తెగలను ఎస్.టి. జాబితాలో చేర్చి 50 సంవత్సరాలు (1976- 2026) పూర్తి అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని...
నేటి నుంచి మూడు రోజుల పాటు బస్సు యాత్ర
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లంబాడీ, ఎరుకల, యానాది తెగలను ఎస్.టి. జాబితాలో చేర్చి 50 సంవత్సరాలు (1976- 2026) పూర్తి అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు ప్రథమ విడత ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర’ నిర్వహించనుంది. బస్సు యాత్రను గురువారం ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ మహేశ్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. తొలి దశ యాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల మీదుగా సాగనుంది. సెప్టెంబర్ 18న హైదరాబాద్ లోని ఎల్.బి. ేస్టడియంలో నిర్వహించబోయే మహా బహిరంగ సభతో ఈ స్వర్ణోత్సవ వేడుకలు ముగుస్తాయి. ఈ సందర్భంగా ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ ‘మన హక్కు... మన గౌరవం... మన భవిష్యత్తు’ అనే నినాదంతో ఈ స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్టు చెప్పారు.