లక్ష్మిగూడలో చదరపు గజం 51 వేలు
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:16 AM
రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మిగూడలో చదరపు గజం ధర రూ.51 వేలు పలికింది. బుధవారం లక్ష్మీగూడలో 14 ఓపెన్ ప్లాట్లను హౌసింగ్ బోర్డు బహిరంగ వేలం ద్వారా విక్రయించగా అనూహ్యమైన స్పందన వచ్చింది.
హాట్ కేకుల్లా అమ్ముడైన 14 ప్లాట్లు
రూ.14.75 కోట్ల ఆదాయం రాక
హౌసింగ్ బోర్డు స్థలాల విక్రయానికి స్పందన
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మిగూడలో చదరపు గజం ధర రూ.51 వేలు పలికింది. బుధవారం లక్ష్మీగూడలో 14 ఓపెన్ ప్లాట్లను హౌసింగ్ బోర్డు బహిరంగ వేలం ద్వారా విక్రయించగా అనూహ్యమైన స్పందన వచ్చింది. వేలం పాటలో 49 మంది కొనుగోలుదారులు పాల్గొనగా ప్లాట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. హౌసింగ్ బోర్డు అధికారులు లక్ష్మీగూడలోని ప్లాట్లకు చ.గజానికి రూ.32 వేలను అప్‌సెట్ ధర(కనీస ధరగా) నిర్ధారించగా, వేలం పాటలో గరిష్ఠంగా చదరపు గజం రూ.51 వేలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 14 ప్లాట్ల విక్రయాల ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల మేర ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డు సౌత్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ భూముల విక్రయాల్లో చదరపు గజం ధర అత్యధికంగా రూ.51 వేలు పలికితే.. అత్యల్పంగా చదరపు గజానికి రూ.36 వేలు పలికింది. సగటున చదరపు గజం ధర రూ. 44,285గా ఖరారయ్యింది.