ముఖ్యమంత్రివి పగటి కలలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:22 AM
రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ కాలపరిమితి పొడిగింపు అసాధ్యమని, జమిలి ఎన్నికల వల్ల మరో ఆరు నెలలు అదనంగా తానే సీఎంగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగటికలలు కంటున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు....
జమిలి ఎన్నికలు జరిపితే.. ప్రభుత్వ కాలపరిమితి పొడిగింపు అసాధ్యం
అవసరమైతే ఐదారు నెలలు రాష్ట్రపతి పాలన
పునర్విభజనతో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు మేలు
దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు
2011 జనాభా ప్రాతిపదికన మహిళా కోటా
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్, మార్చి29(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ కాలపరిమితి పొడిగింపు అసాధ్యమని, జమిలి ఎన్నికల వల్ల మరో ఆరు నెలలు అదనంగా తానే సీఎంగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగటికలలు కంటున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితి 5 సంవత్సరాలు మాత్రమేనని, ఆ సమయాన్ని పొడిగించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అలాగే, పునర్విభజన వల్ల ఎస్సీ, ఎస్టీ, మహిళలకు జరిగే మేలును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1975--77 ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితిని 5 ఏళ్ల నుంచి ఆరేళ్లకు పెంచిందని, కానీ 1978లో జనతా పార్టీ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ కాలపరిమితిని ఐదేళ్లకే పరిమితం చేసిందని గుర్తు చేశారు. అసెంబ్లీ కాలపరిమితి పొడిగింపు రాజ్యాంగ విరుద్ధమన్నారు. 2029లో జమిలి ఎన్నికలు జరిగినా రాజ్యాంగానికి లోబడే ప్రక్రియ ఉంటుందన్నారు. అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది కానీ దానిని పొడిగించే అధికారం ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. అవసరమైతే ఐదారు నెలలు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని వివరించారు. ఇక, చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలు, మహిళల ప్రాతినిధ్యం పెరగకుండా కాంగ్రెస్ కుట్ర పన్నిందని లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 అసెంబ్లీ సీట్లు ఉన్నాయని పునర్విభజన జరిగితే ఎస్సీలకు 29, ఎస్టీలకు 18 సీట్లు కేటాయిస్తారని తెలిపారు. ఎంపీ సీట్లలో ఎస్సీలకు 5, ఎస్టీలకు 3 కేటాయిస్తారని చెప్పారు. అలాగే ప్రతీ కేటగిరీలో మహిళలకు మూడోవంతు సీట్లు దక్కుతాయని వివరించారు. సీఎం రేవంత్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉత్తర- దక్షిణ వాదనను తెరపైకి తెచ్చారని విమర్శించారు. గతంలో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే జనాభా ప్రాతిపదికన చేపట్టవద్దంటూ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు అడ్డుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదే అంశాన్ని వక్రీకరించి రాజకీయంగా మహిళల రిజర్వేషన్లను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 50 శాతం ప్రతిపాదన అమలైతే లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 సీట్లు సుమారు 816కి పెరిగే అవకాశముందన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుంచి సుమారు 179కి, పార్లమెంట్ సీట్ల సంఖ్య 17 నుంచి 26కు చేరే అవకాశముందని తెలిపారు. ఫలితంగా చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలు, మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.