Share News

kumaram bheem asifabad- రూ. లక్షల వ్యయం.. పర్యాటకులు శూన్యం

ABN , Publish Date - Sep 10 , 2026 | 10:47 PM

ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా జిల్లాకు పేరుంది. కనువిందు చేసే జలపాతాలు ఉన్నాయి. ఆహ్లాదం పంచడానికి పర్యాటక శాఖ నుంచి నిధులు ఖర్చు చేస్తున్నా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. నే

kumaram bheem asifabad- రూ. లక్షల వ్యయం.. పర్యాటకులు శూన్యం
లోగో

-పంచాయతీకి లేక్‌ వ్యూ రెస్టారెంట్‌ భవనం అప్పగింత

- అధికారులు దృష్టి సారించాలని ప్రజల వినతి

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా జిల్లాకు పేరుంది. కనువిందు చేసే జలపాతాలు ఉన్నాయి. ఆహ్లాదం పంచడానికి పర్యాటక శాఖ నుంచి నిధులు ఖర్చు చేస్తున్నా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. నేటి సమాజంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు తీరిక లేని పనులతో కాలంతో పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆహ్లాదాన్ని కల్పించాలనే ఆశయంతో మండలంలోని అడ ప్రాజెక్టు వద్ద పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రూ. 65 లక్షలతో బోటింగ్‌, లేక్‌ వ్యూ రెస్టారెంట్‌లను ఏర్పాటు చేశారు. ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో జిల్లాలోని పలు మండలాలకు అడ ప్రాజెక్టు వద్ద పర్యాటక కేంద్రం ఉన్నదనే విషయం తెలియకపోవడం గమనార్హం. దీంతో లక్షలు ఖర్చుచేసి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన బోటింగ్‌, లేక్‌వ్యూ రెస్టారెంట్‌లు నిరుపయోగంగా మారాయి. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 10 టీఎంసీలు కాగా 2022 ఆగస్టులో కురిసిన బారీ వర్షాలకు కరకట్ట కొంతమేర దెబ్బతింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిలువ సామర్థ్యాన్ని 5నుంచి6 టీఎసంసీల మధ్యే కొనసాగిస్తున్నారు. శీతాకాలం, వేసవి కాలాల్లో నీటి నిలువ మరింత తగ్గి బోటింగ్‌కు వీలు లేకుండా పోతుంది.

కనీస నీటి మట్టం లేక..

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటి వరకు భారీ వర్షాలు లేక ప్రాజెక్టులో కనీస నీటిమట్టం కూడ రాలేదు. దీంతో పర్యాటక అభివృద్దిని అధికారులు గాలికి వదిలేశారు. ఐటీడీఏ పరిధిలోని లేక్‌వ్యూ రెస్టారెంట్‌ భవనాన్ని పంచాయతీకి అప్పగించారు. మరమత్తులు చేసిన అనంతరం అద్దెలకు ఇవ్వడానికి పంచాయతీ పాలకవర్గం యోచిస్తుంది. ఆసిఫాబాద్‌ మండలంలోని ఆడ గ్రామం వద్దగల కుమరంభీం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లో బోటింగ్‌ కోసం ఏప్రిల్‌, 2023లో అప్పటి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ రూ. 25 లక్షలతో పెద్ద పడవ,చిన్న పడవలను కొనుగోలు చేశారు. వీటితో పాటు పర్యాటకులకోసం ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రూ. 40 లక్షల టూరిజం నిధులతో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో లేక్‌వ్యూ రెస్టారెంట్‌ నిర్మించారు. కానీ కుమరంభీం ప్రాజెక్టు వద్ద పర్యాటక అభివృద్ధి కలగానే మిగిలింది. 2023లో పర్యాటకులను ఆకర్షించడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన బోటింగ్‌కు మొదట్లో గిరాకీ ఉండేది. ఒక్కొక్కరికి రూ. 50 టికెట్‌ ధర నిర్ణయించారు. మొదటినాలుగు నెలలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, జిల్లా కేంద్రం ప్రజలు ప్రాజెక్టులో బోటింగ్‌ను అస్వాదించడానికి వచ్చేవారు. ఆ తర్వాత నిర్వహణ గాడి తప్పింది. బోటింగ్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. పర్యాటకులను ఆకర్షించే ఇతర సౌకర్యాలేవి కల్పించకపోవడంతో ఆదరణ కరువైంది. బోటింగ్‌ పడవ, రెస్టారెంట్‌ నిరుప యోగంగా మారాయి. కాగా బోటింగ్‌కు వచ్చే పర్యాటకులకు స్నాక్స్‌ వంటివి అందు బాటులో ఉండే లా టూరిజం నిధులు రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన లేక్‌వ్యూ రెస్టారెంట్‌ ప్రస్తుతం మందుబాబులకు అడ్డగా మారింది. రెస్టారెంట్‌ గది తలుపుల అద్దాలను అకతా యిలు పగులగొట్టారు. దీనికి తోడు రెస్టారెంట్‌ లోపలి భాగంలో అపరిశుభ్రంగా తయారైంది. బోటు వృథాగా పడి ఉండటంతో ఇనుప చువ్వలు, సామగ్రి తుప్పు పడుతున్నాయి.

Updated Date - Sep 10 , 2026 | 10:47 PM