Share News

kumaram bheem asifabad- ముందుచూపు కొరవడి..

ABN , Publish Date - Jun 26 , 2026 | 10:23 PM

జిల్లాలోని మున్సిపాలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుచ డంలో ముందుచూపు కొరవడడంతో ఈ ఏడాది ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవనే ఆందోళన నెలకొన్నది. జిల్లాలో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో ప్రధాన కాల్వల్లో పారిశుధ్య పనులపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఆయా కాలనీ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు

kumaram bheem asifabad- ముందుచూపు కొరవడి..
లోగో

- రోడ్లపైకి మురుగునీరు

- పేరుకుపోతున్న చెత్తాచెదారం

- మేలుకోకుంటే ముప్పేనంటున్న కాలనీవాసులు

కాగజ్‌నగర్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మున్సిపాలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుచ డంలో ముందుచూపు కొరవడడంతో ఈ ఏడాది ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవనే ఆందోళన నెలకొన్నది. జిల్లాలో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో ప్రధాన కాల్వల్లో పారిశుధ్య పనులపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఆయా కాలనీ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. చిన్నపాటి వర్షాలకే కాలనీల్లో వివిధ డ్రైనేజీల్లో నీరు నిండుతోంది. ప్రధాన డ్రైనేజీల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరుగుతుండటంతో, చెత్తాచెదారం పేరుకు పోవడంతో వర్షం నీరు పోక నిలిచిపోతోంది. దీంతో దుర్గంధం వెదజల్లడంతో పాటు ఈగలు, దోమల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో పలు వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు పడక ముందే అధికార యంత్రాంగం ముందస్తుగా స్పందించి నీరు నిలిచే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించి గతేడాది జరిగిన తప్పిదాలు ఈ సారి జరుగకుండా పక్కాగా చేపట్టాలని అంతా కోరుతున్నారు.

- కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో..

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 30 వార్డుల పరిధి లో 70వేల జనాభా ఉంది. ప్రసుత్తం పారిశుధ్య విభాగంలో కాంట్రాక్టు విధానంపై 196 మంది విధులు నిర్వహిస్తున్నారు. అలాగే పర్మనెంటు కార్మికులు 20 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు జ వాన్లు, తొమ్మిది మంది మహిళా కార్మికులు విధు లు నిర్వహిస్తున్నారు. వివిధ వార్డుల్లో చెత్త సేకరణకు ప్రతి రోజు నాలుగు ట్రాక్టర్లలో 30 మంది, 12 ఆటోల్లో 12 మంది చెత్త సేకరణ వెళ్లుతున్నారు. మిలిగిన 50 మంది మహిళలను వీధులను శుభ్రం చేయిస్తున్నారు. మరో 116 మంది కాంట్రాక్టు కార్మికులను వివిధ వార్డుల్లోని మురికి కాల్వలను శుభ్రం చేయిస్తున్నారు. మిగిలిన 24 మంది కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులను ఆస్తిపన్ను వసూలు, కార్యాలయానికి సంబంధించిన పని నిమిత్తం వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వార్డుల వారీగా ప్రతి రోజూ సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. పట్టణంలోని సంజీవయ్య కాలనీ, ఇర్ఫాన్‌నగర్‌, ఓల్డుకాలనీ, ద్వారకానగర్‌, బాలాజీనగర్‌, కౌసర్‌నగర్‌ లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు అధికంగా ఉండడంతో వర్షం నీరు పోయేందుకు వీలు లేకుండా ఉంది. గతేడాది కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షం నీరు వచ్చి చేరడంతో రాత్రంతా ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఆయా కాలనీ వాసులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇలాంటి తప్పిదాలు కాకుండా ముందస్తుగా ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరారు. అర్ధరాత్రి భారీ వర్షాలు కురిస్తే తమ కాలనీల్లో పూ ర్తిగా జాగరణ చేయాల్సిన పరిస్థితి ఉందని పలు కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు.

- 20 వార్డుల పరిధిలో..

ఆసిఫాబాద్‌ పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి. ఇందులో 6,512 కుటుంబాలు, 20 వేల జనాభా ఉంది. 20 వార్డుల పరిధిలో 120 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది పైకాజీనగర్‌, బజారువాడి, రవిచంద్ర కాలనీ, తదితర కాలనీల ప్రజలు వరద నీటితో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పట్టణంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా ఇళ్ల ఎదుట అక్రమంగా ర్యాంపులు నిర్వహించారు. దీని వల్ల డ్రైనేజీల్లో పూడిక తీయ డం కష్టంగా మారింది. చిన్నపాటి వర్షం కురిసిన రోడ్డుపైకి వర్షం నీరు వచ్చి చేరుతోందని పలువురు పేర్కొంటున్నారు. అలాగే పైకాజీనగర్‌, బ్రాహ్మణ వాడ, బజారువడి, రహత్‌నగర్‌, రవిచంద్రకాలనీ, హడ్కోకాలనీలకు వరద ముప్పు ఉంది. ప్రస్తుతం పట్టణంలో రెండు ట్రాక్టర్లు, ఐదు ట్రాలీ ఆటోలతో చెత్తను సేకరిస్తున్నారు. ఈ విషయమై ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య, తిరుపతిలను వివరణ కోరగా వర్షాకాలంలో ప్రధాన కాల్వల్లో నీరు నిల్వకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయా వార్డుల పరిధిలో స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని కూ డా చేపడుతున్నట్టు తెలిపారు.

Updated Date - Jun 26 , 2026 | 10:23 PM