Share News

kumaram bheem asifabad- ప్రసవ వేదన

ABN , Publish Date - Aug 30 , 2026 | 10:48 PM

కుమరం భీం జిల్లా ఏజెన్సీ పరిధిలోని గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం, అంబులెన్స్‌లు సైతం వెళ్లలేక పోవడం వల్లే గర్భిణులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వచ్చిందటే చాలు పొంగి పొర్లుతున్న వాగులు అడుగు తీసి అడుగు వేయలేని దారులు.. అంబులెన్స్‌లు రాని రహదారులు.. అక్కడి తల్లులకు ప్రసవ వేదనకు గురిచేస్తున్నాయి.

kumaram bheem asifabad-  ప్రసవ వేదన
లోగో

- అంబులెన్స్‌లు సైతం గ్రామాలకు వెళ్లలేని దుస్థితి

- ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత

ఆసిఫాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా ఏజెన్సీ పరిధిలోని గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం, అంబులెన్స్‌లు సైతం వెళ్లలేక పోవడం వల్లే గర్భిణులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వచ్చిందటే చాలు పొంగి పొర్లుతున్న వాగులు అడుగు తీసి అడుగు వేయలేని దారులు.. అంబులెన్స్‌లు రాని రహదారులు.. అక్కడి తల్లులకు ప్రసవ వేదనకు గురిచేస్తున్నాయి. రహదారి మార్గాలు లేక ఎడ్లబండ్లే దిక్కవు తున్నాయి. పురిటినొప్పులతో అవస్థలు పడుతున్న గర్భిణులను సమయానికి ఆసుపత్రులకు చేర్చే దారి లేక కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతన్నారు. ఎడ్లబండిపై వాగులు దాటి సమయానికి ఆస్పత్రికి చేరితే సరి. లేదంటే తల్లీబిడ్డ ప్రాణాలకు సంకటంగా మారుతోంది.

- నడకకు సైతం..

జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల పరిధిలోని రోడ్లపై వర్షాకాలంలో నడిచేందుకు సైతం తీవ్ర అవ స్థలు తప్పడం లేదు. భారీ వర్షాలు కురిస్తే వాగులు, కల్వర్టుల పైనుంచి వరదనీరు ఉప్పొంగితే రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయా గ్రామాల పరిధిలో ఎవరైన గర్భిణి పురిటి నొప్పులతో బాధపడితే ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులకు తీవ్ర అవస్థలు తప్పడం లేదు. ఇటీవల జిల్లాలోని కెరమెరి మండలంలోని దేవాపూర్‌ కోలాం గూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ కొడప రామేశ్వరి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా మార్గమధ్యలో గ్రామ శివారులో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు దాటేందుకు ప్రత్యేక డోలి ఏర్పాటు చేశారు. అతి కష్టం మీద వాగు దాటించి ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. తిర్యాణి మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన దొడ్డిగూడ గ్రామానికి చెందిన కుడ్మెత ఏసుబాయి అనే మహిళ వాంతులు, విరోచనలతో తీవ్ర అస్వస్థకు గురైంది. ఆశా కార్యకర్త చంద్రకళ ప్రథమ చికిత్స చేసినా తగ్గకపోవడంతో ఎడ్ల బండిపై ఏసుబాయిని దొడ్డిగూడ నుంచి రోంపల్లి వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఆటోలో తిర్యాణి మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. గత కెరమెరి మండలంలోని బోర్లగూడకు చెందిన అశ్విని ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను 102లో స్వగ్రామానికి తీసుకు వస్తున్న క్రమంలో అనార్‌పల్లి గ్రామశివారులో ఉన్న వాగు ప్రమాదకరంగా ప్రవహించింది. దీంతో బిక్కుబిక్కుమంటటూ కుటుంబీకులు తల్లీబిడ్డలను ఎత్తుకొని వాగుదాటించారు. దహెగాం మండలంలోని మారు మూల గిరిజన గ్రామమైన లోహకు చెందిన చెందిన పుష్పలత అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో 108కు సమాచారం ఇచ్చారు. లోహకు వెళ్లేదారి బురదమయంగా ఉండడంతో గ్రామం వరకు అంబులెన్స్‌ రాలేకపోయింది. కుటుంబ సభ్యులు నెలలు నిండిన పుష్పలతను ఆరు కిలోమిటర్ల దూరం వరకు ఎడ్ల బండిలో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ప్రసవం తర్వాత కూడా మళ్లీ ఎడ్లబండిలోనే కుటుంబ సభ్యులు ఇంటికి చేర్చారు. ఇలా జిల్లాలో ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని మారుమూల గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

- 15 మండలాల పరిధిలో..

జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం ఐదు సామాజిక ఆసుపత్రులు, రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 118 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 44 మంది వైద్యుల పోస్టులకు గాను కేవలం 27 మంది విధులు నిర్వహిస్తున్నారు. మరో 17 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి, స్టాఫ్‌ నర్సులు, ఫార్మాసిస్టులు, హెల్త్‌ సూపర్‌వైజర్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, ఏఎన్‌ఎం ఇతర సిబ్బంది మొత్తం 481పోస్టులకు గాను 336 మంది పని చేస్తున్నారు. 145 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో లేక సేవలు అందించలేక పోతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 101కి పైగా గిరిజన గూడాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా అఽధికారులు గుర్తించారు. తిర్యాణి, కెరమెరి, లింగాపూర్‌, జైనూర్‌, సిర్పూర్‌(యు), బెజ్జూరు, దహెగాం మండలాల పరిధిలోని ఆయా గ్రామాలకు వర్షాకాలంలో కనీసం కాలినడకన కూడా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. భారీ వర్షాలకు వాగులు, ఒర్రెలు ప్రవహిస్తే వైద్యు సిబ్బంది సైతం వెళ్లడం కష్టంగా ఉంటుంది. ఎక్కడైనా వైరల్‌ జ్వరాలతో మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఇబ్బంది పడితే వాగులు, ఒర్రెలు దాటుకుంటూ అక్కడి చేరుకోవడం వైద్య సిబ్బందికి సవాలుగా మారుతోంది.

Updated Date - Aug 30 , 2026 | 10:48 PM