ఆ బాలుడు.. మృత్యుంజయుడు
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:29 AM
కాంట్రాక్టరు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి.. ఓ బాలుడి ప్రాణం మీదకు వచ్చింది. అయితే ఆ చిన్నారి ఒక్క క్షణంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు.
ఒక్కసారిగా నేలకొరిగిన విద్యుత్ స్తంభం
అప్రమత్తతతో ఒక్క క్షణంలో దక్కిన ప్రాణం
కర్నూలులో గగుర్పాటు కలిగించిన ఘటన
కర్నూలు న్యూసిటి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టరు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి.. ఓ బాలుడి ప్రాణం మీదకు వచ్చింది. అయితే ఆ చిన్నారి ఒక్క క్షణంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. కర్నూలులో మంగళవారం జరిగిన ఈ ఘటన తీవ్ర గగుర్పాటు కలిగించింది. 45వ వార్డు అశోక్‌నగర్‌లో మంగళవారం ఉదయం 7.26 గంటల సమయంలో ఓ విద్యార్థి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా కుప్పకూలింది. విద్యుత్ సరఫరా ఉండటంతో వైర్ల తాకిడికి నిప్పులు కూడా చెలరేగాయి. సరిగ్గా స్తంభం కూలిపోతున్న సమయంలో అటువైపు చూసిన బాలుడు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి పరుగెత్తాడు. క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డాడు. అదే సమయంలో.. మరో రెండు క్షణాల ముందు ఇద్దరు పిల్లలతో బైకుపై వస్తున్న వ్యక్తి కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అక్కడి ఓ ఇంటి సీసీ కెమెరాల్లో నమోదైన ఈ దృశ్యాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
కాంట్రాక్టరు, అధికారుల నిర్లక్ష్యం వల్లే
అశోక్‌నగర్‌లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కాలువల నిర్మాణం కోసం గుంతలు తవ్వారు. అక్కడ పనులు చేయిస్తున్న ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి స్తంభానికి ఓ వైపు మొత్తం మట్టిని తవ్వించేశాడు. దీంతో మట్టిబలం లేకపోవడంతో స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. సాధారణంగా కాలువలకు గుంతలు తీసే సమయంలో విద్యుత్ స్తంభాలను మరోచోటకు మార్చడమో లేక , ముందస్తుగా వాటికి మొదలు భాగాన్ని కాంక్రీట్‌తో పటిష్ఠ పరచడమో చేయాలి. అలా కాకుండా కాలువ కోసం కాంట్రాక్టర్ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. కనీసం పనులను పరిశీలించాల్సిన కార్పొరేషన్ అధికారులు కూడా పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్‌ను నమ్ముకోవడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.