Share News

జాగ్రత్త.. మిత్రపక్షం కాబట్టి చెబుతున్నా..

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:08 AM

జాగ్రత్త.. మిత్రపక్షం కాబట్టి చెబుతున్నా.. 90 మంచి పనులు చేసి.. 90 మందికి పథకాల లబ్ధి చేకూర్చి.. నలుగురికి నష్టం కలిగించే పనులు చేస్తే..

జాగ్రత్త.. మిత్రపక్షం కాబట్టి చెబుతున్నా..

  • 90 మంచి పనులు చేసి.. నాలుగు చెడు చేస్తే నష్టపోతారు

  • బీఆర్‌ఎస్‌ పడిపోవడంలో ధరణిదీ ఓ పాత్ర

  • అధికార కాంగ్రెస్కు కూనంనేని హెచ్చరిక

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ‘‘జాగ్రత్త.. మిత్రపక్షం కాబట్టి చెబుతున్నా.. 90 మంచి పనులు చేసి.. 90 మందికి పథకాల లబ్ధి చేకూర్చి.. నలుగురికి నష్టం కలిగించే పనులు చేస్తే.. వారు రోడ్డెక్కుతారు. ఆ ఒక్కటి చాలు ప్రభుత్వానికి నష్టం కలిగించేందుకు..’’ అంటూ అధికార కాంగ్రెస్‌ను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ హైడ్రా, హిల్ట్‌గానీ ఏదైనా సరే.. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకుంటేనే ప్రభుత్వానికి మంచి పేరొస్తదని, లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలంలోని ప్రణీత్‌ అంటీలియా గేటెడ్‌ కమ్యూనిటీ వారి సొంతం అని, హైడ్రా అక్కడ దారికోసం ప్రహరీని కూల్చివేసిందని, దానిమీద కోర్టు స్టే ఉన్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీనిపై ఆ గేటెడ్‌ కమ్యూనిటీ వాళ్లు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని, ఏ పార్టీ, ప్రభుత్వమైనా.. మంచిపనులు చేయాలని, మళ్లీ అధికారంలోకి రావాలనే అనుకుంటుందని, అయితే ఎక్కడో ఓచోట ఇలాంటి తప్పులు చేయడం వల్లే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పడిపోవడంలో ధరణిదీ ఓ కీలక పాత్ర అని వెల్లడించారు. రాష్ట్రంలో ఇళ్లు కూల్చుతుంటే మిత్రపక్షంగా ఉన్న కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారంటూ అన్ని వర్గాలవారూ ప్రశ్నిస్తున్నారన్నారు. మూసీ ప్రక్షాళనలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో ఇచ్చిన 58, 59 జీవోల ప్రకారం గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలివ్వాలని, అవసరమైతే ఇండ్లు నిర్మించాలని ఇవ్వాలని సూచించారు. ఇదిలా ఉండగా.. తమిళనాడు, కేరళలో గవర్నర్లు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని, తెలంగాణ గవర్నర్‌ మాత్రం అలా లేరని, అయినా దేశంలో గవర్నర్‌ వ్యవస్థను రద్దుచేయాల్సిన అవసరం ఉందని కూనంనేని అభిప్రాయపడ్డారు.

Updated Date - Mar 19 , 2026 | 04:08 AM