Share News

కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి దుర్మరణం

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:04 AM

జిల్లా కేంద్రమైన నాగర్‌ కర్నూల్‌ మండలంలోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానగా మారినట్లు ఓ పసికందు మృతికి కారణమైంది..

కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి దుర్మరణం

  • కులం పేరుతో బాధిత కుటుంబానికి దర్శన నిరాకరణ

  • కుల వివక్ష ప్రదర్శించారని ఆరోపణలు

  • పసికందు మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

  • చిన్నారి మృతితో శని, ఆదివారాల్లో తీవ్ర ఉద్రిక్తత

  • బీఆర్‌ఎస్‌, బీఎస్పీ, సీపీఎం, బీసీ సంఘాల ఆందోళన

హైదరాబాద్‌/నాగర్‌కర్నూల్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన నాగర్‌ కర్నూల్‌ మండలంలోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానగా మారినట్లు ఓ పసికందు మృతికి కారణమైంది.. ఈ నెల 19న జరిగిన ఈ జాతరలో నెలకొన్న రద్దీలో భక్తులకు, నిర్వాహకులకు మధ్య జరిగిన తోపులాటలో నిరుపేద రజకుడు చిల్కేశ్వరం గణేశ్‌ను ఆయన భార్య పక్కకు తీసుకెళ్తుండగా, వారి 2 నెలల కూతురు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. నిర్వాహకులు కాలితో తన్నడం వల్లే గాయపడిందని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి.. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందడంతో కుమ్మెర గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతరలో కుల వివక్ష జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అగ్ర కులాల జాతర నిర్వాహకులు చిన్నారి తల్లిదండ్రులను కులం ఆధారంగా ఆలయ ప్రవేశానికి నిరాకరించారని, దీనిపైనే వాగ్వాదం జరిగిందని బాధితులు చెప్పారు. ఈ సందర్భంగా వారిపై దాడి చేయడంతో జరిగిన తొక్కిసలాటలో చిన్నారి కింద పడటంతో గాయపడిందని వాపోయారు. జాతర నిర్వాహకులు కాలితో తన్నడం వల్లే తమ కూతురు చనిపోయిందని వారు ఆరోపించారు. నిర్వాహకుల దాడి వల్లే తమ చిన్నారి చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు గణేశ్‌, మౌనిక తమకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు ఈ ఘటనపై మానవ హక్కుల న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) విచారణకు ఆదేశించింది. సంబంధిత అధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరినట్లు సమాచారం. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించినప్పుడూ ఉద్రిక్తత నెలకొంది. దళితులు, బీసీ సంఘాలు, బీఆర్‌ఎస్‌, బీఎస్పీ, సీపీఎం ఆధ్వర్యంలో అర్థరాత్రి వరకూ ఆందోళన కొనసాగింది. బాధితులతో ఫోన్‌లో మాట్లాడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. చిన్నారి మృతి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నాగర్‌ కర్నూల్‌ ఎస్పీకి కవిత ఫోన్‌ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు బాధిత కుటుంబంతో కలిసి నాగర్‌ కర్నూల్‌ డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన రెడ్డి మాట్లాడుతూ బాధితులు ఫిర్యాదు చేసినా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న రాజ్యాధికార పార్టీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ చిన్నారి మృతి కారకులపై హత్య కేసు నమోదు చేయాలని డీఎస్పీని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఎందుకు పెండింగ్‌లో పెట్టారని ప్రశ్నించారు. అటుపై పోలీస్‌ స్టేషన్‌ వద్ద రాస్తారోకో చేసి కుమ్మెర గ్రామానికి వెళ్లారు.

Updated Date - Feb 23 , 2026 | 02:04 AM