kumaram bheem asifabad- కుమరం భీం త్యాగం దేశానికి స్ఫూర్తి
ABN , Publish Date - May 29 , 2026 | 10:30 PM
కుమరం భీం త్యాగం దేశానికి స్ఫూర్తిదా యకమని అయన ఆశయాలతో ముందుకు సాగాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మండలంలోని రౌటసంకెపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కుమరం భీం జల్ జంగల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం- 2026 కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుమరం భీం పుట్టిన రౌటసంకెపల్లి గ్రామం కేవలం ఒక గ్రామం మాత్రమే కాదని ఆదివాసీ వీరత్వం, త్యాగం, ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతికగా నిలిచే పవిత్ర స్థలమని చెప్పారు.
- యువత లక్ష్యం కోసం శ్రమించాలి
- రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్, మే 29 (ఆంధ్ర జ్యోతి): కుమరం భీం త్యాగం దేశానికి స్ఫూర్తిదా యకమని అయన ఆశయాలతో ముందుకు సాగాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మండలంలోని రౌటసంకెపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కుమరం భీం జల్ జంగల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం- 2026 కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుమరం భీం పుట్టిన రౌటసంకెపల్లి గ్రామం కేవలం ఒక గ్రామం మాత్రమే కాదని ఆదివాసీ వీరత్వం, త్యాగం, ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతికగా నిలిచే పవిత్ర స్థలమని చెప్పారు. అమరవీరుడు కుమరం భీం జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేశారని తెలిపారు. కుమరంభీం ఆదివాసిల హక్కులు, ఆత్మగౌరవం కోసం గొప్ప సైన్యం లేకపోయిన ధైర్యసాహసలతో పోరాడారని చెప్పారు. భీం త్యాగం దేశ ఆత్మగౌరవానికి చిరస్మరణీయ ఉదాహరణగా నిలిచిందన్నారు. ఆదివాసీ మహానేతల ఆలోచనలు ఆదర్శాలను యువత భావి తరాలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. గ్రామోత్సవం ద్వారా గ్రామీణాభివృద్ధి, సంప్రదాయ విద్య, ఆరోగ్యం, సామాజిక చైతన్యానికి ప్రాధాన్యం కల్పించడం అభినందనీయమన్నారు. మహిళల సాధికారత లేకుండా సమాజం అభివృద్ధి సాధ్యం కాదని వివరించారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి విద్య, గౌరవం, స్వాంలంబన దిశగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. యువత తమ మూలాలను సంస్కృతి, సంప్రదాయలని మరువకూడదన్నారు. క్రమ శిక్షణ, కఠోరశ్రమ, సమాజసేవ భావన ద్వారానే విజయాన్ని సాధించవచ్చన్నారు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాల ద్వారా చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేస్తున్నప్పటికీ సమాజ భాగస్వామ్యం కూడ అంతే ముఖ్యమని చెప్పారు. భవిష్యత్‌లో రౌటసంకెపల్లి గ్రామం ఆదర్శ ఆదివాసీ ఆభివృద్ధి సామాజిక చైతన్యానికి ప్రతికగా నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామోత్సవం నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు.
మాజీ గవర్నర్ బండారు దత్తత్రేయ మాట్లాడుతూ ఆత్మగౌరవ పోరాటానికి పునాది వేసిన పోరాటయోదుడు కుమరంభీం అని కొనియాడారు. భీం జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేశారన్నారు. అయన స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ రావడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన అమరవీరుడు ఆదివాసీల ఆరాధ్యదైవం కుమరం భీం అన్నారు. జిల్లాలో గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారని చెప్పారు. రోడ్ల నిర్మాణానికి అటవీ అనుమతులు అడ్డంకిగా మారాయని తెలిపారు. గవర్నర్ చొరవ చూపి అటవి అనుమతులు వచ్చేలా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలో మద్యపాన నిషేధంపై సభలో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామంలోని గిరిజన కుటుంబాలకు సౌరవిద్యుత్ పలకలను, కుమరం భీం, ఎడ్లకొండు కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, హరీష్‌బాబు, వెంకటరమణరెడ్డి, వెడ్మ బొజ్జు, కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, కార్యక్రమ నిర్వహకులు ఆశాలత, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి..
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగాశుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో వైద్య పరంగా అభివృద్దికి కృషి చేసి రోగులకు మెరుగైన సేవలు అందించలన్నారు. జిల్లాలో 464 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని చెప్పారు. వారిని జిల్లా అధికారులు ఒక్కొక్కరిని దత్తత తీసుకొని నెలకు సరిపడా మందులు, పౌష్టికాహరం అందించాలని సూచించారు. వ్యాధిపై సరైన అవగాహన కల్పించి సరైన చికిత్స అందించాలన్నారు. యువత మాదక ద్రవ్యాలు, మత్తుకు బానిసై తమ ఉజ్జ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. నశముక్త్ భారత్‌వైపు అడుగులు వేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఆకాంక్షిత జిల్లాలో అభివృద్ధ్ద పథంలో తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత జిల్లాలో శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనులపై గవర్నర్‌కు పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్ల, ఏఎస్పీ చిత్తరంజన్, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గవర్నర్‌కు ఘనస్వాగతం..
జిల్లా పర్యటనకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రానికి విచ్చేసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్‌లు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పోలీసుల చేత గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు.