పాతాళంలో దాక్కున్నా రేవంత్‌ను వదిలిపెట్టం
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:37 AM
ఎంత మంది దేవుళ్లు ఉన్నారో అందరినీ మొక్కుకో రేవంత్.. మేమొచ్చాక నువ్వు పాతాళంలో దాక్కున్నా వదిలి పెట్టం’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
హామీలు అమలు చేయని కాంగ్రె్‌సను నిలదీయండి: కేటీఆర్
పరకాల/భూపాలపల్లి/భూపాలపల్లిటౌన్/మహబూబాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ‘ఎంత మంది దేవుళ్లు ఉన్నారో అందరినీ మొక్కుకో రేవంత్.. మేమొచ్చాక నువ్వు పాతాళంలో దాక్కున్నా వదిలి పెట్టం’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్‌లా మారిందని, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. లక్కీ డ్రాలో సీఎం అయిన రేవంత్.. ఉన్నన్ని రోజులు ప్రభుత్వాన్ని సక్కగా నడుపుకోవాలని హితవుపలికారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్ పట్టణాల్లో సోమవారం నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి బామ్మర్దికి సింగరేణిని రాసిచ్చారని, రెండేళ్లలో రూ.6వేల కోట్లను ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఆ కుంభకోణం బయట పెట్టడంతోనే తమను ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులు చేపట్టకుండా ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను చొక్కా పట్టుకుని నిలదీయాలని సూచించారు. భూపాలపల్లి జిల్లా రద్దు చేయాలని చూస్తే.. ఊరుకోబోమని, ఈపు చింతపండు చేస్తామని హెచ్చరించారు. పూజకు పనికి రాని పువ్వు పార్టీ ఒకటి ఉందని, 12 ఏళ్లు ఢిల్లీలో గద్దెకట్టుకొని ఉన్నారని బీజేపీని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను ఓడించి బీఆర్‌ఎ్‌సకు పట్టం కట్టాలని కోరారు.