Share News

దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిస్తే ఉద్యమమే!

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:53 AM

నియోజకవర్గాల పునర్విభజన నెపంతో దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్ల శాతాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే తీవ్ర తిరుగుబాటు తప్పదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ...

దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిస్తే ఉద్యమమే!

  • మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టొద్దు

  • రేవంత్‌ హైబ్రిడ్‌ సీఎం.. ఆయన పాలనా అలాగే ఉంది

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు

హైదరాబాద్‌/పీర్జాదిగూడ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన నెపంతో దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్ల శాతాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే తీవ్ర తిరుగుబాటు తప్పదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నియోజకవర్గాల పునర్వభజనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై మూడేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తూనే ఉందని తెలిపారు. లోక్‌సభ, శాసనసభ సీట్ల పెంపుపై కేంద్రం చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని.. అయితే, దానిని నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం సరికాదన్నారు. ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయండి. లోక్‌సభలో 543సీట్లున్నాయి. అక్కడ మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయండి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడా అమలు చేయండి. సీట్ల పెంపు, పునర్విభజనతో ముడిపెట్టి ఎందుకు అయోమయాన్ని సృష్టిస్తున్నారు?’ అని కేంద్రాన్నినిలదీశారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24 శాతం ప్రాతినిధ్యాన్ని అలాగే కొనసాగించాలని, ఒక్క శాతం కూడా తగ్గేందుకు తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి హైబ్రిడ్‌ ముఖ్యమంత్రి అని, ఆయన ఉదయం కాంగ్రెస్‌ ప్రతినిధిగా ఉంటూ సాయంత్రానికి బీజేపీతో కలిసిపోతున్నారని ఆరోపించారు. రేవంత్‌ పాలనలోనూ ఇదే హైబ్రిడ్‌ విధానం కనిపిస్తోందని, నిలకడలేని వైఖరితో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎవరినీ సంప్రదించకుండా జీహెచ్‌ఎంసీని విభజించిన రేవంత్‌.. ఇతరులకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 03:53 AM