విద్యుత్తు సంక్షోభం నుంచి సిరిసిల్ల నేతన్నలను కాపాడండి: కేటీఆర్
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:09 AM
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టిన విద్యుత్తు సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ..
హైదరాబాద్, సిరిసిల్ల, మార్చి 25(ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టిన విద్యుత్తు సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులను కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో వారిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్తు బకాయిలు, సర్‌చార్జీల భారాన్ని మాఫీ చేయాలని కోరారు. సిరిసిల్ల పట్టణం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు గుండెకాయ వంటిదని, గతంలో ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను డిప్యూటీ సీఎంకు కేటీఆర్ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పీ. వరకు విద్యుత్తు సబ్సిడీని పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని, ప్రస్తుతం విద్యుత్తు అధికారులు విధిస్తున్న ‘బ్యాక్ బిల్లింగ్’ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరించారు. 2016 నుంచి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి 127 చిన్న తరహా యూనిట్లపై అధికారులు రూ.19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారాన్ని మోపారని, అది సర్‌చార్జీలతో కలిపి ఇప్పుడు రూ.38 కోట్లకు చేరిందన్నారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక పలు యూనిట్లు మూతపడటంతో పాటు ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో మాఫీ చేసి నేతన్నలను అదుకోవాలన్నారు. వినతిపత్రం ఇచ్చే సమయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ కూడా ఉన్నారు.