యువత ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:47 AM
భారతీయ యువత కేవలం ఉద్యోగావకాశాల కోసం చూడొద్దని, పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
కృత్రిమ మేధతో పెను మార్పులు: కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): భారతీయ యువత కేవలం ఉద్యోగావకాశాల కోసం చూడొద్దని, పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ‘ఫైర్‌సైడ్ చాట్’లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పెను మార్పులు తీసుకురానుందని హెచ్చరించారు. ఏఐ వల్ల రానున్న రోజుల్లో మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు ప్రభావితమవుతాయని, ఈ మార్పును తట్టుకోవడానికి ప్రభుత్వాలు, సమాజం ఇంకా సిద్ధంగా లేవని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విప్లవాన్ని తట్టుకోవాలంటే యువత నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. భారతదేశంలో ఉన్న యువ జనాభా ఒక శక్తి అని, అయితే అదే సమయంలో అది ఒక సవాలు అని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే సరైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారుచేయాలని చెప్పారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ధైర్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు.