BRS Working President KTR: నన్ను తిట్టడం కాదు..రేవంత్‌ను నిలదీయండి
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:44 AM
గతంలో గాంధీ కుటుంబాన్ని, రాహుల్, సోనియాను అడ్డగోలుగా తిట్టిన రేవంత్‌రెడ్డిని పక్కన పెట్టుకొని తనను తిట్టిపోయడం తగదని...
కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే కేటీఆర్ సూచన
రేవంత్‌కు అరికెపూడి అమ్ముడుపోయారని ధ్వజం
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : గతంలో గాంధీ కుటుంబాన్ని, రాహుల్, సోనియాను అడ్డగోలుగా తిట్టిన రేవంత్‌రెడ్డిని పక్కన పెట్టుకొని తనను తిట్టిపోయడం తగదని, కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే సీఎంను నిలదీయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. వెయ్యి మందిని బలి తీసుకున్న బలిదేవత సోనియా అంటూ మాట్లాడిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు గతం మరిచిపోయారా? అన్ని ప్రశ్నించారు. రాహుల్‌ను ముద్దపప్పు అంటూ రేవంత్ విమర్శించారని తాను గుర్తు చేస్తే.. తనను తప్పు పట్టడం సరి కాదన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం గొట్టనరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లికి చెందిన పలువురు నాయకులు, కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి సర్పంచ్‌తోపాటు అతడి అనుచరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన భూములను కాపాడుకోవడం కోసం రేవంత్‌రెడ్డి పంచన చేరారని, డబ్బులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావును ఓడించాలని కొల్లాపూర్ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. కాగా, అనాథల హక్కులు, యువత అభివృద్థి నేపథ్యంలో.. విద్యావేత్త, అనాధల హక్కుల కార్యకర్త సామినేని నీరజరాణి రచించిన పుస్తకాలను కేటీఆర్ గురువారం నందినగర్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు.