మా రక్తం తీసుకో.. రైతులను ఆదుకో
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:46 AM
‘సీఎం రేవంత్‌రెడ్డీ.. కావాలంటే మా రక్తం తీసుకో.. కానీ, రైతులకు సాగు నీరిచ్చి ఆదుకో’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎల్లంపల్లి వట్టిపోతే హైదరాబాద్‌కు తాగునీరెట్లా?
బేషజాలు వదిలి నీటిని ఎత్తిపోయండి
సీఎంను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు
రక్తం ఇచ్చి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి నిరసన
రక్తం ప్యాకెట్లతో రేవంత్ ఇంటికి వెళ్తున్న బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్
కరీంనగర్ టౌన్/నిజామాబాద్/హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ‘సీఎం రేవంత్‌రెడ్డీ.. కావాలంటే మా రక్తం తీసుకో.. కానీ, రైతులకు సాగు నీరిచ్చి ఆదుకో’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో నీటి మట్టాలు 20 శాతానికి పడిపోయాయన్నారు. మేడిగడ్డ వద్ద నీటి మట్టం 92.5 మీటర్లు ఉన్నప్పుడు నిరభ్యంతరంగా నీళ్లు ఎత్తిపోయవచ్చని వెల్లడించారు. అక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల, మిడ్‌మానేరుకు రోజూ 2-3టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే.. 50 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జలాశయాలను నింపవచ్చని తెలిపారు. మేడిగడ్డతో తమకు సంబంధం లేదని, అక్కడి నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంపులను ప్రారంభించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్(ఎల్‌ఎండీ)ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయకపోతే సాగునీటికే కాదు భవిష్యత్తులో హైదరాబాద్‌కు తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందన్నారు. ‘‘మేడిగడ్డ దెబ్బతిన్న తర్వాత రెండు రోజుల్లోనే క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే ఎన్‌డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది. అది ఎన్‌డీఎ్‌సఏ కాదు.. ఎన్డీఏ రిపోర్టు’’ అని విమర్శించా. ఇప్పటికైనా బేషజాలకు పోకుండా గోదావరి నీటిని ఎత్తిపోయాలని కోరారు. కాగా, ‘నా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లు ఇవ్వండి..’ అంటూ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి స్వయంగా రక్తదానం చేసి నిరసన తెలిపారు.
శ్రీరామ్‌సాగర్ పరిధిలోని ముప్కాల్ పంప్‌హౌజ్ వద్ద రైతులతో కలిసి ఆయన మాట్లాడుతూ పంటలు కాపాడేందుకు కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. అనంతరం బాల్కొండ రైతులు ఇచ్చిన రక్తం ప్యాకెట్లు, వినతిపత్రాన్ని ఎస్సారెస్పీ అధికారులకు అందజేసి.. సీఎం రేవంత్‌కు పంపించాలని కోరారు. కాగా, తెలంగాణ భవన్‌లో ‘రేవంత్‌రెడ్డికి రక్తదానం’ పేరిట బీఆర్‌ఎస్ యువజన విభాగం, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ రక్తదానం చేసిన అనంతరం.. బీఆర్‌ఎస్‌వై, బీఆర్‌ఎస్‌వీ ప్రతినిధులు ఆ రక్తం ప్యాకెట్లతో.. సీఎం నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.