Share News

KTR Urges: పంచాయతీ స్ఫూర్తితో మునిసిపల్‌ పోరుకు సిద్ధం కండి

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:04 AM

పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో మునిసిపల్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

KTR Urges: పంచాయతీ స్ఫూర్తితో మునిసిపల్‌ పోరుకు సిద్ధం కండి

  • కాంగ్రెస్‌ సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరించండి

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో మునిసిపల్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పురపాలికల్లో గులాబీ జెండాలనెగురవేసేందుకు కృషి చేయాలని శుక్రవారం జరిగిన సమావేశంలో కరీంనగర్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు. అన్ని జిల్లాల నేతలతోనూ రోజువారీ సమావేశమవుతామని ఆయన తెలిపారు.. తమ పరిధిలోని మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థ ఎన్నికలకు తాము సిద్ధమని కేటీఆర్‌కు కరీంనగర్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రెండున్నర దశాబ్దాలుగా పార్టీ వెంట నిలిచిన కరీంనగర్‌.. బీఆర్‌ఎ్‌సకు కంచుకోట అని అభివర్ణించారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసినా, అడ్డదారులు తొక్కినా.. పంచాయతీ ఎన్నికల్లో 4000కి పైగా పంచాయతీల్లో బీఆర్‌ఎస్‌ గెలవడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి స్పష్టమైన సంకేతమన్నారు. గ్రామాలు, పట్టణాలకతీతంగా ప్రజలు గులాబీ జెండా వైపు చూస్తున్నారన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను వివరించి ప్రజల్లో చైతన్యం తేవాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఉర్దూ యూనివర్శిటీ నిర్వీర్యానికి ప్రయత్నం: కేటీఆర్‌

హైదరాబాద్‌కే తెలమానికంగా ఉన్న దేశంలోని ఏకైక ఉర్దూ యూనివర్శిటీని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్‌ సర్కారు ప్రయత్నిస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. హైదరాబాద్‌ నందినగర్‌లోని తన నివాసంలో శుక్రవారం మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని అక్రమంగా తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ అవసరాలకు వినియోగించాలని చూస్తున్నారని మండి పడ్డారు. దేశంలో మైనార్టీల సంరక్షకుడినని చెప్పుకొనే రాహుల్‌ గాంధీ.. ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయడమేనా..? వారిని కాపాడటమా అని ప్రశ్నించారు.

Updated Date - Jan 10 , 2026 | 05:04 AM