Share News

కేటీఆర్‌పై వారంలో చార్జిషీట్‌!

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:46 AM

ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఈ వారమే కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ నేరాభియోగ ...

కేటీఆర్‌పై వారంలో చార్జిషీట్‌!

  • ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ దాఖలు

  • కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ అభియోగపత్రం

  • అన్ని పత్రాలను సిద్ధం చేసుకుంటున్న అధికారులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఈ వారమే కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ నేరాభియోగ పత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. కేసు విచారణ దాదాపు పూర్తయిందని, న్యాయస్ధానంలో చార్జిషీట్‌ దాఖలు చేయడమే తరువాయి అని ఉన్నతాధికారులు తెలిపారు. చార్జిషీట్‌కు ఇప్పటికే తుదిరూపం ఇచ్చిన ఏసీబీ అధికారులు.. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు డీవోపీటీ అనుమతి కోసం ఆగారు. తాజాగా డీవోపీటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి రావడంతో ఆ విషయాన్ని ప్రభుత్వం ఏసీబీకి తెలియజేసింది. దీంతో ఏసీబీ అధికారులు ఈ వారంలో చార్జిషీట్‌ దాఖలుకు కావాల్సిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు కీలకమైన పలు ఎలక్ర్టానిక్‌, డిజిటల్‌ సాక్ష్యాధారాలను సేకరించారు. ఫార్ములా ఈ-కారు రేసు వల్ల హెచ్‌ఎండీఏకు రూ.75.88 కోట్ల నష్టం జరిగిందన్న విషయాన్ని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలను సేకరించారు. ఫార్ములా ఈ-ఆపరేషన్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏస్‌ నెక్స్ట్‌జెన్‌ కంపెనీకి కారు రేసు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.45 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు రావడం క్విడ్‌ ప్రొకోలో భాగమేనన్న విషయాన్ని చార్జిషీట్‌లో ఏసీబీ అధికారులు పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గతేడాది నవంబరులో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి 2024 డిసెంబరు 18న ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీని ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. ఈ మేరకు అర్వింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి, కేటీఆర్‌లను ఈడీ, ఏసీబీ అధికారులు విచారించారు. చార్జిషీట్‌లో కేటీఆర్‌ తదితరులు నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యారని, ఇతరులకు లాభం కలిగించే విధంగా ప్రవర్తించారని ఏసీబీ అధికారులు పేర్కొనబోతున్నట్లు సమాచారం.

Updated Date - Feb 16 , 2026 | 02:46 AM