కేసీఆర్‌పై కక్షతో రైతులకు శిక్ష
ABN , Publish Date - Jul 06 , 2026 | 03:23 AM
కేసీఆర్‌పై కక్షతో సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారు
రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం రేవంత్‌రెడ్డి
ఎల్‌అండ్‌టీ మరమ్మతు చేస్తామన్నా
31 నెలలుగా ఎందుకు ఆపారు?: కేటీఆర్
భూపాలపల్లి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌పై కక్షతో సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమపై కక్షతో తెలంగాణ రైతులకు శిక్ష విధిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కన్నెపల్లి పంప్‌హౌస్‌ను కేటీఆర్ ఆదివారం బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరం లాంటిదైతే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి పట్టిన శనేశ్వరం లాంటివారని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 పిల్లర్లు ఉంటే.. రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని కేటీఆర్ అన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు కేసీఆర్ పేరు ప్రతిష్ఠలను బద్నాం చేయడానికి ఎవరో కావాలనే ఈ పని చేశారనే బలమైన అనుమానం తమకు ఉందన్నారు. కుంగిన రెండు పిల్లర్ల బ్లాకును పూర్తిగా మళ్లీ నిర్మించడానికి అయ్యే ఖర్చు రూ.400 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఆ ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తామని, ప్రభుత్వానికి ఒక్క రూపాయి భారం పడకుండా రిపేర్ చేసి ఇస్తామని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. అయినా31 నెలలుగా రిపేర్ చేయనివ్వకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా పోతోందని కేటీఆర్ అన్నారు. కేవలం వారం రోజులు కేసీఆర్‌కు సమయం ఇచ్చి.. ఎస్‌ఈ, ఈఈ, డీఈఈ, ఏఈఈలను అప్పగిస్తే రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో నీటిని నింపుతామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రాంతానికి సంబంధించింది మాత్రమే కాదని, రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల బీడు భూములకు సాగు నీరందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రభుత్వం దురుద్దేశంతోనే మోటార్లు ఆన్ చేయడం లేదని ఆరోపించారు. ఒకవేళ నీరు ఇచ్చినా యూరియా ఇచ్చే సోయి లేదని, కరెంట్ ఇచ్చే సత్తా, ధాన్యం కొనే తెలివి, మద్దతు ధర, బోనస్ ఇచ్చే ఆలోచన లేవని ధ్వజమెత్తారు. ఈ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీళ్లను లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. పొలాలు ఎండిపోతుండటంతో కరీంనగర్, చొప్పదండి, బోయిన్‌పల్లి రైతులు ఆందోళన చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. మిడ్‌మానేరు ఎడారిలా మారిందని, ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయాలు పక్కనపెట్టి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను తక్షణమే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో 60 వేల మందితో పంప్‌హౌ్‌సను ముట్టడించి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు.
కేటీఆర్‌కు అడుగడుగునా అడ్డంకులు
మహదేవపూర్/జనగామ రూరల్/హనుమకొండ టౌన్: కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన కోసం వచ్చిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. జనగామ జిల్లా పెంబర్తి టోల్‌ప్లాజా వద్ద కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లెక్కకు మించి వాహనాలు వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం భూపాలపల్లి జిల్లా కమలాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద, కాటారం వద్ద, మహదేవపూర్‌లో పోలీసులు మళ్లీ అడ్డగించి వదిలేశారు. అనంతరం కాళేశ్వరం చేరుకోగా.. అక్కడ కూడా పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు. కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ వద్దకు చేరుకున్నాక బీఆర్‌ఎస్ నాయకులు కొద్దిసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు వారిని పంప్‌హౌ్‌సలోకి వెళ్లనివ్వకుండా గేట్లు మూసివేసి అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్ బృందం బయటి నుంచి పంప్‌హౌస్‌కు ఎదురుగా ఉన్న ఇన్‌టేక్‌వెల్‌ను పరిశీలించారు.