Share News

30కి పైగా గెలుస్తామనుకుంటే..17 వచ్చాయి

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:24 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు గట్టి పోటీ ఇచ్చాయని, 30కిపైగా మునిసిపాలిటీలు వస్తాయనుకుంటే...

30కి పైగా గెలుస్తామనుకుంటే..17 వచ్చాయి

  • అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో బీఆర్‌ఎస్‌ గట్టి పోటీనిచ్చింది

  • కాంగ్రెస్‌ ఆశించినన్ని స్థానాలు రాలేదు

  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రచారం చేసినా ఆ పార్టీ ఒక్క మునిసిపాలిటీ కూడా గెలవలేదు

  • చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు గట్టి పోటీ ఇచ్చాయని, 30కిపైగా మునిసిపాలిటీలు వస్తాయనుకుంటే... 17వచ్చాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. హంగ్‌ ఏర్పడిన చోట్ల కూడా తమకు విజయావకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్‌ పార్టీ విచ్చలవిడిగా ఖర్చు చేసినా.. ఆశించినన్ని స్థానాలు గెలవలేదని అన్నారు. ఫలితాలపై ఆ పార్టీ అసంతృప్తితోనే ఉందని చెప్పారు. ఇక, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వచ్చి ప్రచారం చేసినా... ఆ పార్టీ ఒక్క మునిసిపాలిటీనీ గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల కంటే సీట్లు, ఓట్లు తగ్గినా.. సంతోషపడడం బీజేపీకే చెల్లిందని వ్యాఖ్యానించారు. మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలపై శనివారం మీడియాతో కేటీఆర్‌ చిట్‌చాట్‌గా మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ గురించి అడ్డగోలుగా మాట్లాడిన వాళ్లందరికీ ఈ ఫలితాలే సమాధానం చెప్పాయన్నారు. తాము అధికారంలో ఉండగా... ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ 4 మునిసిపాలిటీలు మాత్రమే గెలుచుకుందని గుర్తు చేశారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులకు సంబంధించిన నిబంధనల విషయంలో నిన్నటి దాకా కలెక్టర్లు ఒక మాట, సీఎస్‌ ఒక మాట చెప్పారని, దీనిపై ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదని విమర్శించారు. ఫార్ములా-ఈ రేసు కేసును ప్రభుత్వం మరోసారి తెరపైకి తీసుకొస్తుందని, ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు పిలిచి... పోలీసులు సాధించేదేమీ లేదని, కేవలం మరోసారి తమాషా కోసమే పిలవబోతున్నారని ఆక్షేపించారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తామని, చివరకు జైలులో పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

Updated Date - Feb 15 , 2026 | 07:25 AM