Share News

కేటీఆర్‌.. రండి!

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:44 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌)కు సిట్‌ నోటీసు జారీ చేసింది.

కేటీఆర్‌.. రండి!

  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు నేటి ఉదయం 11 గంటలకు రావాలని సిట్‌ నోటీసు

  • మీ పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని వెల్లడి

  • హాజరుకాకపోతే చట్టప్రకారం చర్యలని స్పష్టం

  • కేటీఆర్‌ పాత్రపై సిట్‌ వద్ద స్పష్టమైన ఆధారాలు!?

  • ఆయన కూడా ఊహించలేని సాక్ష్యాల్ని ముందు పెట్టేందుకు అధికారులు సన్నద్ధం!

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌)కు సిట్‌ నోటీసు జారీ చేసింది. ఈనెల 23వ తేదీ (శుక్రవారం) ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి అయిన జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. నందినగర్‌లోని కేటీఆర్‌ ఇంటికి వెళ్లిన సిట్‌ బృందం నోటీసు కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో 2024లో నమోదైన క్రైం నంబర్‌ 243 కేసులో సెక్షన్‌ 166, 409, 427, 201, 120(బి) రెడ్‌విత్‌ 34 ఐపీసీ, సెక్షన్‌ 3 ఆఫ్‌ పీడీపీపీ యాక్ట్‌, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్‌ 65, 66, 66 (ఎఫ్‌)(1)(బి)(2)70 ప్రకారం దర్యాప్తు జరిగిందని, ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలంటూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం ఈ నోటీసు జారీ చేశారు. నోటీసు అందుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి సిట్‌ ముందుకు వచ్చిన పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఫోన్ల ట్యాపింగ్‌ వెనక నాటి సీఎం కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌ ఉన్నారని పలుమార్లు ఆరోపించారు. మావోయిస్టుల ముసుగులో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర పార్టీల ముఖ్య నాయకులు, జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు, చివరికి, తమ బంధువైన హరీశ్‌ రావు, కుమార్తె కవిత ఫోన్‌ కూడా ట్యాప్‌ చేశారని గత ఏడాది ఆగస్టు 8న సిట్‌ విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలనే అప్పట్లో సిట్‌ విచారణకు హాజరైన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సైతం చేశారు.


ఎన్నికలకు ముందు తమ పార్టీ నాయకులకు చెందిన వేలాది ఫోన్లను ట్యాప్‌ చేశారని, ఫలితంగా, 90 స్థానాల్లో గెలుస్తామనుకున్న తాము 63 సీట్లకే పరిమితమయ్యాయని, ఫోన్‌ ట్యాపింగ్‌ను వాడుకుని బెదిరింపులకు పాల్పడడమే ఇందుకు కారణమని అప్పట్లో ఆయన ఆరోపించారు. ఇక, రాజకీయ నాయకులే కాకుండా పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారని, తద్వారా వచ్చిన సమాచారంతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని, అప్పట్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి వచ్చిన వందల కోట్ల ఎలకో్ట్రరల్‌ బాండ్ల వెనక ఫోన్‌ ట్యాపింగ్‌ బెదిరింపులు ఉన్నాయనే ఆరోపణలపైనా సిట్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు. సెలబ్రిటీల ఫోన్లు ఎందుకు ట్యాపింగ్‌ చేయించాల్సి వచ్చిందనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. అలాగే, టీజీపీఎస్సీలో ప్రశ్న పత్రం లీక్‌ కేసు విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయమూర్తి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్‌ చేశారన్న కోణంలోనూ సిట్‌ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేయడంతో ట్యాపింగ్‌ వ్యవహారంలో చివరికి మిగిలిన ఆధారాలు 618 ఫోన్లకు సంబంధించినవి మాత్రమే. కానీ, అంతకు ముందు జరిగిన ట్యాపింగ్‌, ఫోన్‌ మానిటరింగ్‌కు సంబంధించి ఒక్కో వ్యక్తికి సంబంధించి వందల పేజీల సీడీఆర్‌లను సిట్‌ సేకరించింది. ఇవన్నీ కూడా విచారణ ప్రారంభమైన తర్వాత టెలికం నోడల్‌ అధికారుల ద్వారా సేకరించినవే. ఆధారాలను ధ్వంసం చేసేశామని ఎస్‌ఐబీలోని పెద్దలు దీమాగా ఉన్నప్పటికీ టెలికం నోడల్‌ అధికారులు భద్రపరిచే డేటా విషయాన్ని విస్మరించడంతో మొత్తం ట్యాపింగ్‌ విశ్వరూపాన్ని సిట్‌ బయటకు తీసుకుని వచ్చింది. నిజానికి, ట్యాపింగ్‌కు ప్రభుత్వాల నుంచి అధికారికంగా వచ్చిన వినతికి సమాచారం ఇచ్చి ఆ తర్వాత ఆయా వివరాలను ధ్వంసం చేస్తామని టెలికం ప్రొవైడర్లు చె ప్పినా.. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎ్‌సఎల్‌) సహకారంతో టెలికం ప్రొవైడర్ల నుంచి ట్యాపింగ్‌ లిస్టులు సంపాదించడంలో సిట్‌ అధికారులు విజయం సాధించారు. 2023 నవంబర్‌ నెలకు సంబంధించి 618 ఫోన్‌ నంబర్ల జాబితానే కాకుండా 2022 నుంచి మొత్తం ఫోన్‌ ట్యాపింగ్‌ సమాచారాన్ని సిట్‌ రిట్రీవ్‌ (తొలగించిన సమాచారాన్ని తిరిగి పొందడం) చేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, మాజీ మంత్రి హరీశ్‌ రావును విచారించినప్పుడు 2022కు సంబంధించిన ట్యాపింగ్‌ వివరాలను ఆయన ముందు సిట్‌ అధికారులు ఉంచిన సంగతి తెలిసిందే.


కేటీఆర్‌ పాత్రపై స్పష్టమైన ఆధారాలు!?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేటీఆర్‌ పాత్రపై సిట్‌ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని సమాచారం. వాటి ఆధారంగా పూర్తి సాక్ష్యాధారాలతో సిట్‌ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించి.. ఆ వచ్చిన సమాచారాన్ని వాడుకుని.. ఏవిధంగా లబ్ధి పొందినా ఈ కేసులో నేరస్థులు అవుతారని సిట్‌ అధికారులు చెబుతున్నారు. ఈ లింకును స్పష్టంగా నిరూపించడానికి సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాతే కేటీఆర్‌ను పిలిచి విచారణ చేస్తున్నామని సిట్‌ అధికారులు చెబుతున్నారు. కేటీఆర్‌ కూడా ఊహించలేని ఒక విషయాన్ని ఆయన ముందు పెట్టడానికి సన్నద్ధమైనట్లు వివరిస్తున్నారు.

కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ!

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో విచారణకు రావాల్సిందిగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు నోటీసు జారీచేసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆయన భేటీ అయినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం సిరిసిల్ల నుంచి బయలుదేరిన కేటీఆర్‌ నేరుగా ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సిట్‌ నోటీసులో పేర్కొన్న అంశాలు, విచారణ సమయంలో సిట్‌ అధికారులు అడిగే ప్రశ్నలు, వాటికి ఏం సమాధానాలు చెప్పాలన్న దానిపై కేసీఆర్‌, కేటీఆర్‌ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల విచారణకు హాజరైన హరీశ్‌రావును ఏమేం ప్రశ్నించారు? తాజాగా తనను ఏం అడగనున్నారు? అన్నదానిపై కేసీఆర్‌తోపాటు, న్యాయ నిపుణలతో కూడా కేటీఆర్‌ సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సిట్‌ విచారణకు హాజరుకానున్న కేటీఆర్‌, ఉదయం 9గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు, ముఖ్యనేతలతో ఆయన సమావేశమై.. ఆ తర్వాత నేరుగా విచారణకు వెళ్లనున్నారు. ఇందుకుగాను అన్ని జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు, కేటీఆర్‌ అభిమానులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్‌కు రావాలని నేతలు పిలుపునిచ్చారు.

Updated Date - Jan 23 , 2026 | 08:25 AM