Share News

పవన్‌కల్యాణ్‌ను ఎవరడ్డుకున్నారు?

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:09 AM

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఒక సోదరుడిగా తన ఇంటికి వస్తే ఆదరించి బిర్యానీ పెడతామని.. అంతేకానీ తెలంగాణ సచివాలయంలో కూర్చొని పెత్తనం చేస్తామంటే మాత్రం ఊరుకోబోమని.....

పవన్‌కల్యాణ్‌ను ఎవరడ్డుకున్నారు?

  • సోదరుడిగా ఇంటికోస్తే బిర్యానీ పెడతాం.. సచివాలయంలో కూర్చుంటామంటే ఒప్పుకోం

  • జనసేన కొత్తగా పోటీచేసేదేముంది?

  • 2023 ఎన్నికల్లో పోటీ చేయలేదా?

  • ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయలేదా?: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఒక సోదరుడిగా తన ఇంటికి వస్తే ఆదరించి బిర్యానీ పెడతామని.. అంతేకానీ తెలంగాణ సచివాలయంలో కూర్చొని పెత్తనం చేస్తామంటే మాత్రం ఊరుకోబోమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఆయనను గౌరవిస్తామని, సినీ నటుడిగా అభిమానిస్తామని తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు.పవన్‌కల్యాణ్‌ మంగళవారం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘తెలంగాణలో పవన్‌కల్యాణ్‌ను అడ్డుకున్నదెవరు? కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంది. ఏమైనా అనాలనుకుంటే ఆయన కాంగ్రెస్‌ను అనాలి. అయినా.. జనసేన తెలంగాణలో ఇప్పుడు కొత్తగా పోటీచేసేదేముంది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా దాదాపు 350 వార్డుల్లో పోటీచేసింది కదా? 2018లో చంద్రబాబు (టీడీపీ) కూడా వచ్చి పోటీచేశారు. ఏ నాయకుడైనా, ఏ నాయకురాలైనా దేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయవచ్చు. అయితే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు 11 రోజులు అన్నం ముట్టలేదని చెప్పిన మీరు... ఇప్పుడు తెలంగాణఆవిర్భావ దినోత్సవం నాడే ఇక్కడికి వచ్చి సభ పెట్టాల్సిన అవసరం ఏముంది...? ఒకాయ తల్లిని చంపి బిడ్డను బతికించారని అంటాడు. ఇంకొకాయన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తీరుకు వ్యతిరేకం అంటాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇష్టం లే దని నేరుగా చెప్పకుండా ఇలా డొంక తిరుగుడుగా చెబుతున్నారు’ అని విమర్శించారు.


తెలంగాణ భూమిపుత్రుల జాగీరే..

తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా 4 కోట్ల మంది భూమిపుత్రుల జాగీరేనని కేటీఆర్‌ అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత 12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందా? ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉందామనేదే మా విధానం. మి మ్మల్ని ఇక్కడికి రావద్దని ఎవరు చెప్పారు? మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. మీ వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి. రండి.. ఇక్కడే ఉండండి. అయితే, తెలంగాణ రాష్ట్రం ఆశామాషీగా ఏర్పడింది కాదు. ఒక ప్రాంతానికి వచ్చేటప్పుడు అక్కడి ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి, వారిని అభిమానించాలి. పవన్‌కల్యాణ్‌ ప్రాంతీయవాదం ఉగ్రవాదంకంటే ప్రమాదరకమని అన్నారు. మరి మద్రాస్‌ రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం కావాలని పొట్టిశ్రీరాములు 58 రోజులు దీక్ష చేసి ప్రాణాలర్పించటాన్ని కూడా ప్రాంతీయవాదమే అంటారా? తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలను ప్రధాని మోదీ గుజరాత్‌కు తరలించుకుపోతూ జాతీయవాదం ము సుగులో ఆర్థిక ప్రాతీయవాదాన్ని ప్రోత్సహించటం సరైనదేనా?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణను కాపాడేందుకు తమకు అసలైన ఓజీ (పవన్‌కల్యాణ్‌ ఓజీ సినిమాను ప్రస్తావిస్తూ) కేసీఆర్‌ ఉన్నారని తెలిపారు. దేశభక్తి గురించి తాము పవన్‌ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.

కొడంగల్‌లో రేవంత్‌ను ఓడిస్తాం..!

తెలంగాణకు మొదటి నుంచీ కాంగ్రెస్సే అసలు శత్రువని కేటీఆర్‌ విమర్శించారు. 2034 వరకు తానే సీఎంగా ఉంటానంటున్న రేవంత్‌రెడ్డిని గతంలో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గంలో కచ్చితంగా ఓడిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీఆర్‌ఎస్‌ 90 సీట్లకు పైగా గెలుస్తుందన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మహారాష్ట్ర సీఎం ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సూచించారు. ఫ్యూచరే లేని రేవం త్‌రెడ్డి, ఫ్యూచర్‌సిటీ లో ప్లాట్లు ఇస్తామని జర్నలిస్టులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవ్వాలనుకుంటే మంచిరేవుల, బుద్వేల్‌ వంటి చోట 100 ఎకరాల భూమి కేటాయించాలని ఆయన సూచించారు.

Updated Date - Jun 04 , 2026 | 06:09 AM