Share News

స్పీకర్‌ ధృతరాష్ట్రుడు అయ్యారు

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:03 AM

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ధృతరాష్ట్రుడు అయ్యారని, ధుర్యోధనుడు సీఎం రేవంత్‌ రెడ్డి చేసే దుర్మార్గాలు ఆయనకు కనబడడం ..

స్పీకర్‌ ధృతరాష్ట్రుడు అయ్యారు

  • రేవంత్‌ చేసే దుర్మార్గాలు ఆయనకు కనబడట్లేదు: కేటీఆర్‌

వికారాబాద్‌, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ధృతరాష్ట్రుడు అయ్యారని, ధుర్యోధనుడు సీఎం రేవంత్‌ రెడ్డి చేసే దుర్మార్గాలు ఆయనకు కనబడడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. పుత్ర ప్రేమతో ఆయన కళ్లు మూసుకుపోయాయని అన్నారు. పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, ఒకరైతే పార్టీ మారి కాంగ్రెస్‌ బీ ఫారం మీద పార్లమెంట్‌కు కూడా పోటీ చేశారని, ఇవన్నీ స్పీకర్‌కు కనిపించడం లేదన్నారు. చివరకు ఆయనకు వికారాబాద్‌ రోడ్లపై ఉన్న గుంతలు కూడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం స్థానిక గౌలీకార్‌ నర్సింగ్‌ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు, ‘సర్‌’ ప్రక్రియపై నిర్వహించిన నియోజకవర్గస్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శిశుపాలుడి వంద తప్పులను శ్రీకృష్ణుడు లెక్కపెట్టినట్లు కాంగ్రెస్‌ వాళ్ల తప్పులను కూడా లెక్కపెడుతున్నామని, టైం దగ్గర పడిందని, వారి ఖేల్‌ ఖతమ్‌, దుకాణం బంద్‌ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని, 2028 నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం పక్కా అని చెప్పారు.

Updated Date - Jun 29 , 2026 | 05:03 AM