KTR Slams Revanth Reddy: పిచ్చోడి చేతిలో రాయిలా పాలన: కేటీఆర్
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:07 AM
తుగ్లక్ పాలన గురించి గతంలో పుస్తకాల్లో చదువుకున్నామని..కానీ ఈరోజు రేవంత్‌రెడ్డి పాలన చూసి తుగ్లక్ పాలన అంటే ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): తుగ్లక్ పాలన గురించి గతంలో పుస్తకాల్లో చదువుకున్నామని..కానీ ఈరోజు రేవంత్‌రెడ్డి పాలన చూసి తుగ్లక్ పాలన అంటే ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి.. హామీల ఆమలును పక్కనపెట్టి కేవలం పేర్లు మార్చడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్ అనేవి తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వ చిహ్నాలని.. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయం వల్ల సికింద్రాబాద్‌కు చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లు ఉన్నదన్నారు. ఇప్పటికైనా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చేరిపేసే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్‌ను జిల్లాగా మారుస్తామని చెప్పారు.