రేవంత్‌ది వెన్నుపోటు రాజకీయం
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:25 AM
సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు పొడుస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
మీనాక్షిపై దొంగకేసులు పెట్టించారు: కేటీఆర్
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు పొడుస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో అత్యంత నిజాయితీపరురాలు, రాహుల్ గాంధీకి నమ్మకస్తురాలైన మీనాక్షీ నటరాజన్‌పైనే ఆయన కుట్రలు చేసి దొంగ కేసులు పెట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్న అడ్డగోలు అవినీతిపై మీనాక్షి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారనే కక్షతోనే.. ఆమెకు పదవి రాకుండా అడ్డుకున్నారన్నారు. ప్రజలకే కాకుండా సొంత పార్టీ వాళ్లకూ గుండు కొట్టి, శఠగోపం పెట్టిన దొంగ అని విమర్శించారు. అధికారంలోకి వచ్చి సగకాలం ముగిసినా ఒక్క హామీనీ నెరవేర్చని కాంగ్రెస్ పాలన ‘అట్టర్ ఫ్లాప్’ సినిమాను తలపిస్తోందని, ఇక మిగిలింది ‘ఎండ్ కార్డ్’ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రజలను, గులాబీ జెండాను మోసం చేసి రేవంత్ పక్కన చేరారని.. ఇది ప్రజా తీర్పును అవమానించడమేనన్నారు. త్వరలోనే ఖైరతాబాద్ ఉపఎన్నిక రావడం ఖాయమని ఆయన అన్నారు.