ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు
ABN , Publish Date - Feb 12 , 2026 | 03:06 AM
రెండేళ్ల పాలనా వైఫల్యాలను మూటగట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఓటమి భయంతోనే మునిసిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలకు తెగబడ్డారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
గులాబీ సైనికులది పోరాట స్ఫూర్తి: కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల పాలనా వైఫల్యాలను మూటగట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఓటమి భయంతోనే మునిసిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలకు తెగబడ్డారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే సీఎం అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అక్రమంగా లూటీ చేసిన వేలకోట్ల ప్రజాధనంతో ప్రజాతీర్పునే మార్చాలని చూస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని బుధవారం ఒక ప్రకటనలో ఆయన హెచ్చరించారు.పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని బీఆర్‌ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపులు, దాడులకు రేవంత్‌రెడ్డి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను, పాలనను పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో అధికారపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పురపాలక సమరంలో గులాబీ సైనికులు పోరాట స్ఫూర్తి కనబరిచారని, పార్టీకి కొండంత బలం, ఆత్మవిశ్వాసాన్ని నింపారని కేటీఆర్ వెల్లడించారు.