KTR: రాహుల్ హౌ..గాడు!
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:51 AM
అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్, అశోక్‌నగర్ సభల్లో తప్పుడు హామీలిచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ అనే హౌ..గాడని నడి బజార్లో ఉరి తీయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కే
రేవంత్ అనే హౌ..గాడిని మనమీదకు వదిలాడు
ఈ తప్పునకు ఆయన్ను నడిబజార్లో ఉరితీయాలి
తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్‌ను ఉరి తీస్తారా?
రేవంత్ కరిసేలా ఉన్నాడు.. ఇంట్లోనే కట్టేయాలని గీతమ్మకు చెబుతున్నాం: కేటీఆర్
జనగామ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్, అశోక్‌నగర్ సభల్లో తప్పుడు హామీలిచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ అనే హౌ..గాడని నడి బజార్లో ఉరి తీయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఉరి తీయాలని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన్ను ఎందుకు ఉరి తీయాలి? చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినందుకా? రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ ఇచ్చినందుకా? ఆడబిడ్డలకు తాగునీటి గోస తప్పించినందుకా? అని నిలదీశారు. ‘‘ఉరి తీయాల్సి వస్తే రేవంత్‌రెడ్డిని కూడా కాదని, వరంగల్, అశోక్‌నగర్ సభలకు వచ్చి 420 హామీలిచ్చి, అమలు చేయించనందుకు, రేవంత్‌రెడ్డి అనే హౌ..గాడని మన మీదకు వదిలినందుకు రాహుల్‌గాంధీని ఉరి తీయాలి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ సర్పంచుల అభినందన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే హైదరాబాద్ నుంచి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని, రీడర్ అని, ఏది రాసిస్తే అదే చదువుతారని ఎద్దేవా చేశారు. రైతు భరోసా పథకం కింద రెండు పంటల డబ్బులను ఎగ్గొట్టాడని, కౌలు రైతులకు కూడా పథకం వర్తింపజేస్తామని చెప్పారని, రైతు కూలీలకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తానని మాటిచ్చి తప్పారని మండిపడ్డారు. అశోక్‌నగర్ సభలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ యువతను మభ్యపెట్టారని విమర్శించారు. అత్తకు రూ.4వేలు, కోడలుకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. మహిళలకు రూ.2,500 ఇవ్వలేని వ్యక్తి వారిని కోటీశ్వరులను ఎలా చేస్తారు? అని నిలదీశారు. కల్యాణలక్ష్మీతోపాటు తులం బంగారం ఇస్తామని మాటిచ్చి మోసం చేశారని మండిపడ్డారు.
ఢిల్లీకి నెలకు 100 కోట్ల చొప్పున మోస్తున్నారు
పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడుతున్నారని, అసెంబ్లీలో ఇష్టంవచ్చినట్లు మొరుగుతున్నారని, ఆయన ఉడత ఊపులకు భయపడొద్దని బీఆర్‌ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డికి ఓనమాలు కూడా తెలియవని, నెలకు రూ.100 కోట్ల చొప్పున రాహుల్‌గాంధీకి మూటలను మోస్తేనే సీఎం పదవి ఉంటుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడితేనే తట్టుకోలేని రేవంత్‌రెడ్డి అసెంబ్లీకి వస్తే తట్టుకుంటారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నీళ్ల గురించి చెప్తానంటూ సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నదులు, ప్రాజెక్టులు, చెరువులు, వాగుల గురించి తెలియని వ్యక్తి నీళ్ల గురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. గతంలో ఆటోవాలాకు డబ్బులిస్తే కావాల్సినన్ని యూరియా బస్తాలు పొలం దగ్గరకే వచ్చేవని, ప్రస్తుతం రైతులు ఉదయాన్నే చలిలో క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.. రేవంత్‌రెడ్డి అన్నట్టుగానే వెనుకటి రాబంధు రోజులను తెచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లను తొక్కి, మోసం చేసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ ఇకనైనా క్రికెట్, ఫుట్‌బాల్ ఆడుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు కదా? అని అన్నారు. రేవంత్ తన సొంత సెక్యురిటీనే కొడుతున్నాడని, ఇష్టం వచ్చినట్లుగా అరుస్తున్నారని, భవిష్యత్తులో కరుస్తాడేమోనని అన్నారు. రేవంత్‌ను ఇంట్లోనే కట్టేయాలని ఆయన భార్య గీతమ్మకు చెబుతున్నానన్నారు. తండ్రి పేరు చెప్పుకుంటున్నానని రేవంత్‌రెడ్డి పదేపదే అంటున్నారని, తన తండ్రి తెలంగాణ తెచ్చిన మొగోడు కాబట్టి బరాబర్ చెప్పుకుంటానని అన్నారు. ‘‘నీలాగా లంగపనులు చేస్తే నీ మనుమడు కూడా నీ పేరు చెప్పుకోడు’’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెప్పు దూళికి కూడా రేవంత్‌రెడ్డి పనికిరాడని విమర్శించారు.
ఉర్దూ వర్సిటీ విద్యార్థుల మద్దతుగా పోరాడతాం
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి (ఎంఏఎన్‌యూయూ) చెందిన 50 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. దీన్ని అడ్డుకోవాలని రాహుల్‌ను డిమాండ్ చేశారు. ఈ అన్యాయంపై బీఆర్‌ఎస్ మౌనంగా ఉండబోదని, ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలుస్తామన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే క్షేత్రస్థాయిలో, న్యాయస్థానాల్లో రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు.