మా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారు
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:40 AM
మునిసిపల్ ఎన్నికల సదర్భంగా రాష్ట్రంలో దాదాపు 34 చోట్ల హంగ్ పరిస్థితులున్నాయని, ఆయా ప్రాంతా ల్లో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు : కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల సదర్భంగా రాష్ట్రంలో దాదాపు 34 చోట్ల హంగ్ పరిస్థితులున్నాయని, ఆయా ప్రాంతా ల్లో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, ప్రలోభపెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపించడం, గూండాలను ఉపయోగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్, బీజేపీల దోపిడీని అడ్డుకునేందుకు కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని తాము ముందుకు వచ్చినట్లు తెలిపారు. సీపీఐ, కాంగ్రెస్ ఇప్పటికే పొత్తులో ఉన్నాయని, ఆ పార్టీలు కొత్తగూడెంలో మేయర్ పదవి పంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు.సింగరేణి కార్మికుల హక్కుల కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని, కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దోపిడీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి సింగరేణి దోపిడీలో భాగస్వాములై సంస్థను నష్టపరిచేవిధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కుల కోసం గతంలో పోరాడినట్లుగానే.. భవిష్యత్తులోనూ పోరాడుతామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో సేవాలాల్ మహరాజ్ జయంతిని ప్రభుత్వపరంగా నిర్వహించామని గుర్తు చేశారు.