ఇది సర్కార్ కాదు.. సర్కస్
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:05 AM
మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, ఈ ప్రాజెక్టు పేరిట జరుగుతున్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
పాకిస్థాన్ కూడా బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీకి
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును అప్పగించడమా?: కేటీఆర్
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, ఈ ప్రాజెక్టు పేరిట జరుగుతున్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై స్పష్టత లేదని విమర్శించారు. బుధవారం బీఆర్‌ఎ్‌సఎల్పీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్‌కు కూడా పనికిరాని వివాదాస్పదమైన కంపెనీకి కాంగ్రెస్ సర్కార్ రెడ్‌కార్పెట్ వేసిందని ఎద్దేవా చేశారు. ‘మెయిన్‌హార్ట్ అనే సింగపూర్ కంపెనీని పాకిస్థాన్ బ్లాక్‌లి్‌స్టలో పెట్టింది. పట్నా ఎయిర్‌పోర్టులో అవకతవకలకు పాల్పడటంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) కూడా ఆ కంపెనీని నిషేధించింది. జార్ఖండ్‌లో ఒక స్టేడియాన్ని రూ.200కోట్ల అంచనాతో ప్రతిపాదించి, ఆ మొత్తాన్ని రూ.500కోట్లకు పెంచిన ఘనత మెయిన్‌హార్ట్ కంపెనీది. భారీగా అవకతవకలకు పాల్పడటంతో సింగపూర్ ప్రభుత్వం కూడా ఈ కంపెనీపై కేసు నమోదు చేసింది. అలాంటి కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే బాధ్యతలను అప్పగించింది.. ఎందుకు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఇది సర్కార్ కాదు.. సర్కస్’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.