Share News

కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తం: కేటీఆర్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:24 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో....

కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తం: కేటీఆర్‌

నర్సంపేట/వర్ధన్నపేట/నయీంనగర్‌/తాండూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రె్‌సది భస్మాసుర హస్తమని ధ్వజమెత్తారు. ఆదివారం వరంగల్‌ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, వికారాబాద్‌ జిల్లా తాండూరులో మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా, హనుమకొండ జిల్లా బాలసముద్రంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రె్‌సకు ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యూరియా కోసం, రైతుబంధు డబ్బుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. గల్లీలో మాటలు మాట్లాడుతూ ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణలో రెండేళ్లుగా అవినీతి, అరాచక పరిపాలన కొనసాగుతోందని, ఓ నేరగాడు ముఖ్యమంత్రి అయితే పర్యవసానాలు ఎలా ఉంటాయనడానికి ఉదాహరణ తాజాగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడమేనని కేటీఆర్‌ ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్రం వెంటనే స్పందించి విశ్రాంత జడ్జి , ఫోరెన్సిక్‌ నిఫుణులతో కమిటీని నియమించి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 09 , 2026 | 02:24 AM