సీఎం రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:58 AM
గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అది తన బినామీ సంస్థగా అంటూ తప్పుడు ప్రచారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
గ్లోబరీనాతో నాకు సంబంధం లేదు
బినామీ సంస్థ ఆరోపణలు అబద్ధం
లైడిటెక్టర్ సహా ఏ విచారణకైనా రెడీ
48 గంటల్లో సీఎం రేవంత్
బహిరంగ క్షమాపణ చెప్పాలి:కేటీఆర్
హైదరాబాద్/ వరంగల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అది తన బినామీ సంస్థగా అంటూ తప్పుడు ప్రచారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రేవంత్ 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘గ్లోబరీనా నా బినామీ అనటం, సీబీఎ్‌సఈ కాంట్రాక్టులు ఇప్పించాననడం అవాస్తవం. ఆ సంస్థతో నాకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు గానీ.. యాజమాన్య హక్కులుగానీ లేవు. దీనిపై లైడిటెక్టర్, సీఐడీ సహా ఏ విచారణకైనా సిద్ధం. అత్యున్నత పదవిలో ఉండి బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు. రాజకీయ లబ్ధి కోసమే నా ప్రతిష్ఠను దెబ్బతీేసలా సీఎం రేవంత్ ఆరోపణలు చేశారు’’ అని ప్రశ్నించారు. గడువులోపు క్షమాపణ చెప్పకుంటే సీఎం రేవంత్‌పై సివిల్, క్రిమినల్ చర్యలతోపాటు పరువు నష్టం దావావేస్తామన్నారు. ఇక ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కర్ణాటక, కేరళ సీఎంలు ధర్నా చేస్తే.. రేవంత్‌రెడ్డి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కొడంగల్‌లో రేవంత్ ధర్నా రాజకీయ నాటకమని విమర్శించారు. రేవంత్ బావమరిదికి సింగరేణి కాంట్రాక్టులు, అమృత్ పథకం కాంట్రాక్టుల కోసమే మోదీకి భజన చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం పదవిపై ఆశ లేదు
హరీశ్‌రావు పార్టీ మారుతారనే ప్రచారం పచ్చి అబద్ధమని కేటీఆర్ చెప్పారు. పుట్టుక, చావు గులాబీ పార్టీతోనేనని హరీశ్ ఎప్పుడో స్పష్టత ఇచ్చారన్నారు. 2027లో ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తానని చెప్పారు. అయితే తనకు సీఎం పదవిపై ఆశ లేదని, కేసీఆర్‌ను మరోసారి సీఎం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు ఏమీ ఉండదన్నారు. అసలు ఆ పార్టీకి ఒక్క నాయకుడైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. బీజేపీకి 12 ఏళ్లలో తొలిసారి విద్యార్థుల రూపంలో భారీ నిరసన ఎదురవుతోందని చెప్పారు. విద్యార్థుల దెబ్బకు ప్రభుత్వాలే మారిపోయాయని, గత ఎన్నికల్లో తమ ఓటమికి కూడా విద్యార్థుల ప్రభావం కొంత ఉందన్నారు.